ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల తరువాత జరిగే మొదటి సమావేశం కావడంతో.. పలు అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.
విభజన అంశాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2వ తేదీ తర్వాత హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే ఉద్యోగుల బదిలీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు, ఆదాయ వనరులపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది. ఇందుకోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.