తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,159కోట్లు.
తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..
ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..
వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..
వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659
హార్టికల్చర్-737
పశుసంవర్ధక శాఖ-19080
మహాలక్ష్మి పథకం-723
గృహజ్యోతి-2418
ప్రజాపంపిణీ వ్యవస్థ-3836
పంచాయతీ రాజ్-29816
మహిళా శక్తి క్యాంటిన్ -50
హైదరాబాద్ అభివృద్ధి-10,000
జీహెఎంసీ-3065
హెచ్ ఎండీఏ-500
మెట్రో వాటర్-3385
హైడ్రా-200
ఏయిర్పోట్ కు మెట్రో-100
ఓఆర్ ఆర్ -200
హైదరాబాద్ మెట్రో-500
ఓల్డ్ సిటీ మెట్రో-500
మూసీ అభివృద్ధి-1500
రీజినల్ రింగ్ రోడ్డు-1525
స్ర్తీ ,శాశు -2736
ఎస్సీ 33124..
ఎస్టీ సంక్షేమం-17056..
మైనారిటీ సంక్షేమం-3000
బీసీ సంక్షేమం-9200
వైద్య ఆరోగ్యం-11468
విద్యుత్-16410
అడవులు ,పర్యావరణం-1064
ఐటి-774
నీటి పారుదల -22301
విద్య-21292
హోంశాఖ-9564
ఆర్ అండ్ బి-5790
ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ పూర్తి ప్రసంగం యథాతదంగా..
గౌరవ అధ్యక్షా!
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని మహాకవి దాశరథి గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియాగాంధి గారి ఆశీస్సులతో, కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. గత పదేళ్ళ అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానీకానికి మా ప్రభుత్వం తరుపున కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సాకారమవుతాయని తెలంగాణ ప్రజలు ప్రాణాలను సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఆ ఉద్యమాల తీవ్రత వెనుకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది .
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది.
- చిలికి చిలికి గాలి వాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 75,577 కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలా పెరిగి 6,71,757 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పదిరెట్లు పెరిగింది. తదనుగుణంగా రాష్ట్ర అభివృద్ది జరగలేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నీళ్ళు, నిధులు, నియామకాలు దక్కడం లేదన్న కారణంగా ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి? అన్న ప్రశ్నకు మనమంతా కలసి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉంది.
- తెలంగాణ వాటాగా వచ్చే నీళ్లను రాష్ట్ర ప్రజల త్రాగునీరు, సాగునీరు అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. అయితే గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాల కారణంగానూ, నాణ్యత లేని పనుల కారణంగానూ సాగు నీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. నీళ్ళు ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా, అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పని చేయడం వల్ల రైతుల సాగునీటి సమస్యలు అపరిష్కృతం గానే మిగిలి పోయాయి. పర్యవసానంగా మన నీళ్ళను మనం సమర్థవంతంగా వాడుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుండి బయటపడే విధంగా తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతో పాటు మరింత మేలయిన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది.
- ఇక నిధుల విషయానికి వస్తే, గత ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా గాని, అప్పుల ద్వారా గాని, తదితర మార్గాల ద్వారా గాని సమకూరిన నిధుల వ్యయానికీ, రాష్ట్ర పురోగతికీ ఏమాత్రం పొంతన లేని పరిస్థితి నెలకొంది. ఒక ప్రక్క అప్పులు పెరగడంతో పాటు వేరొక ప్రక్క బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది.
- ప్రణాళికాబద్ధంగా నడపవలసిన రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ఒంటెద్దుపోకడలతో స్వంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించక గత ప్రభుత్వం చేసిన తప్పిదాల పర్యవసానం మేము వారసత్వంగా అందుకున్నాము. రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం, నేడు అప్పుల కుప్పగా మారడం విచారకరం. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు, పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవడం వారి ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి, ప్రజాసంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే. ఇటువంటి నిర్లక్ష్యవైఖరి వలన అటు ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక, సామాన్య ప్రజలు, ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు, పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు.
- మా ప్రభుత్వం ఏర్పడేనాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కున్న పెనుసవాలు. తలకుమించిన రుణభారం ఉన్నప్పటికీ, దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాము. తద్వారా, ఉద్యోగులకు, పెన్షన్ దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్ దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
- డిసెంబర్, 2023 లో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేనాటికి 6,71,757 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వపరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాము. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించాము. అంటే, మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి, అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది.
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. ఈ పథకాలలో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యం పై సబ్సిడీలు మరియు చేయూత. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి (Capital Expenditure) కూడా అదనంగా 19,456 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళ తరువాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్దమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసన సభలో ప్రవేశపెట్టడం జరిగింది.
- గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు కల్లలై పోయాయి. కొత్త ఉద్యోగాలను సృష్టించడం అనే మాట అటుంచితే, ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియలలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి. తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది.
- ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయడానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది. TGPSC సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మురియు మౌలిక వసతులను సమకూర్చాము. పోలీసు, వైద్య మరియు ఇతర రంగాలలో ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందచేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ ను త్వరలోనే ప్రకటిస్తున్నాం.
- గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. తత్ఫలితంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ప్రజల ఆకాంక్షలతో, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచాలనే ధృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ప్రజల గుండె చప్పుళ్ళకు స్పందించి రూపొందించినవే. మా హామీలు అలవి కానివని ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు చేస్తుండడం గమనార్హం. సంకల్పబలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ, పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించాము. ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికి వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికి సరఫరా చేస్తున్నాము. పేదలకు సొంతింటి కల నేరవేర్చే ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించాం. నెలకు 200 యూనిట్ల విద్యుత్ ను అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తున్నాం. ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుపరిచాం, ఇది మా నిజాయితీకి నిదర్శనం. రైతుభరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తాము.
- “బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా” (The Budget is not just a collection of numbers but also an expression of our values and aspirations) మేము ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్, మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు:
ఆర్థిక రంగం
- 2023-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారత దేశ ఆర్థిక రంగం 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతంగా వృద్ధిని నమోదు చేసాయి. అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధిరేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి.
- 2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల రూపాయలు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి రేటు నమోదయింది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం ఉంది.
- ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు, పెరిగిన రుణం వల్ల, ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమౌతుంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతుందంటే – కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది. దానిని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని, ఆదాయాన్ని సమన్వయ పరిచే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
తలసరి ఆదాయం: - 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు. జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు. దీనితో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగా ఉంది. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862 రూపాయలు కాగా, వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం 1,80,241 రూపాయలు. దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తుంది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలను తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలను రూపొందించి అమలుపరుస్తుంది.
వివిధ రంగాలలో వృద్ధిరేటు - 2023-24లో తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువలో(Gross Value added) సేవల రంగం ద్వారా 65.7 శాతం, పారిశ్రామిక రంగం ద్వారా 18.5 శాతం, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా 15.8 శాతం సమకూరింది.
- ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 తో పోల్చినప్పుడు, 2023-24 వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జోడింపబడిన స్థూల విలువ 4 శాతం వృద్ధి చెందింది. రాష్ట్ర జనాభాలో 47.3 శాతం మంది ప్రజలు ఈ రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నందు వల్ల, తెలంగాణలో జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీసు రంగంపై 33 శాతం మంది, పారిశ్రామిక రంగంపై 19.7 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు.
- జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ/కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (Labour Force Participation Rate) అధికంగా ఉంది.
ప్రజా పాలన: - “సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు. ఆ రెండూ కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్లు. పునాది ఎంత బలంగా ఉంటే, ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది” (Political democracy cannot succeed without social and economic democracy. These two form the foundation of political democracy. The stronger the foundation, the stronger the democracy —Dr.B.R.Ambedkar) డా.బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన ఈ సిద్ధాంతం మాకు శిరోధార్యం. త్రికరణ శుద్ధిగా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధికి, అసమానతలు లేని సమ సమాజ స్థాపనకు అడుగులు వేస్తుంది.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసింది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రభుత్వ హామీల అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, వార్డులలో సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి 1 కోటి 9 లక్షల ధరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వాటన్నింటిని కంప్యూటర్ ప్రొగ్రాం ద్వారా క్రోడీకరించాము. వచ్చిన ధరఖాస్తులన్నింటిని పరిశీలించి వివిధ పథకాలకు అర్హులైన వారినందరిని గుర్తించి వారికి పథకాలను అందజేస్తున్నాం. ఈ సంవత్సరం మార్చి5వ తేదీ నుండి ప్రతీ మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలని ప్రారంభించాము. ఈ సేవా కేంద్రాలలో రేషన్ కార్డులు, ఆధార్, గ్యాస్ సిలిండర్, ఎల్.పి.జి ఐడి, విద్యుత్ వినియోగ నంబర్ లాంటి వాటికి సవరింపులు చేసుకునే వెసులుబాటు కల్పించాము.
ప్రజావాణి - దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధి గారు చెప్పినట్లు ప్రభుత్వం పేదరిక నిర్మూలన, పథకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారునికి చేరుతుంది. ప్రభుత్వ పథకాలు, పాలన ఫలితాలు అర్హులకు సరిగా అందనప్పుడు వారు నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అలాంటి వారు తమ గళం విప్పి సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉంటారు. అటువంటి వారి సమస్యలు వెనువెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకువచ్చాం. గతంలో సామాన్యులకు దుర్భేధ్యమైన ప్రగతిభవన్ ముళ్ల కంచెలు తొలగించి, తలుపులు తెరిచి, మహాత్మ జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మార్చాం. అక్కడే వారానికి రెండు రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ, సామాన్య ప్రజల విశ్వసనీయతను చూరగొన్నాం. ప్రజలనుంచి అందుకున్న ప్రతి ఆర్జీకి రశీదు ఇస్తున్నాం. ఆర్జీలన్నింటిని ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది. ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక IAS అధికారిని నియమించాం.
వ్యవసాయ రంగం – రైతుకు ఆలంబన - “ఏ పని అయినా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగదు” (Everything can wait, but not agriculture — Jawaharlal Nehru) మన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారు చెప్పిన ఈ మాటలను మేము బలంగా విశ్వసిస్తున్నాం మరియు ఆచరిస్తున్నాం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు. అప్పులు చేసైనా ఆహారం అందించాలన్న తపోదీక్ష రైతన్నది. ఆహార భద్రత కల్పిస్తూ సమాజాన్ని ఆదుకునే రైతన్నకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే, రైతన్నలకు తగిన ప్రోత్సాహకాలను కల్పించాలి. రైతుకి ఇచ్చే చేయూత రెండు విధాలుగా ఉండాలి. మొదటిది వారికి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడడం, రెండవది వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడడం.
రుణ మాఫీ - It always seems impossible until it’s done —Nelson Mandela. “ఏదైన పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది” అని నెల్సన్ మండెలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాలా వర్తిస్తాయి. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది. ఎంతో సాహసోపేతంగా మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీగారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది. గత ప్రభుత్వం 2014 లో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, 2014 నుండి 2018 వరకు నాలుగు విడుతల్లో నిధులు విడుదల చేసింది. ఇలా పలు దఫాలలో నిధుల విడుదల వల్ల అసలు తీరకపోవడంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది. రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్లీ లక్షరూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయారు. వడ్డీ భారం పెరిగిపోవడం, పాత బకాయిలు తీరకపోవడం వలన బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. వ్యవసాయానికి పెట్టుబడి అందక, రైతులు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది.
- చేతగానమ్మకు మాటలెక్కువన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాల ప్రయత్నించారు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 12, 2018 వ సంవత్సరం నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నింటికి రుణమాఫీ వర్తింప చేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాము. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో, పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31 వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం. జులై 18న లక్ష రూపాయల వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలలో ఒకేసారి జమ చేసాం. రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. ఈ రుణమాఫీ తో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి. వారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది.
రైతు భరోసా - గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం క్రింద 80,440 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందడం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి. గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం వలన ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమయ్యింది. గత ప్రభుత్వం, వారు రూపొందించుకున్న నియమ నిబంధనలను వారే తుంగలో తొక్కారు. ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని నేరం.
- మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా, రైతుబంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. దీని అమలుకు విధివిధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఈ కమిటీ పలు జిల్లాలలో పర్యటించి ఆ ప్రాంత రైతులను, వ్యవసాయ రంగ నిపుణులను, మేధావులను సంప్రదించి, వారి అభిప్రాయాలను సేకరించింది. ప్రజాభిప్రాయాలన్నింటిని క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి, చర్చించి గౌరవ శాసన సభ్యులందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి. అంతే కాని నాలుగు గోడల గడీల మధ్యన కాదు అనే మా పనితీరుకు రైతుభరోసా విధానం ఒక ఉదాహరణ.
రైతు కూలీల సంక్షేమం:
- భూమిలేని గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులుండాల్సిన బాధాకరమైన పరిస్థితి. వీరికి గత పదేండ్లలో ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు.
- భూమిలేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాము.
పంట బీమా - అతివృష్టి, అనావృష్టులు రైతన్నల పాలిట శాపాలు. ఏడాదిపాటు శ్రమించినా అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణ భారం తో కృంగి పోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్యస్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగండ్లకు కారణమయ్యింది.
- మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకంలో చేరాలని నిర్ణయించాము. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది.
వరిపంటకు బోనస్ - తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది. పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనివల్ల సన్నరకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
రైతు నేస్తం: - వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వలన ఉపయోగం. టెక్నాలజి మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం. రైతులకు ఎప్పటికప్పుడు క్రొత్త శాస్త్రీయ పద్దతుల ద్వారా దిగుబడులు పెంచుకోవడం, పంటలను తెగుళ్ల బారి నుండి రక్షించుకోవడం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించడం మా ప్రాధాన్యతగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్నాం.
ధరణి - కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి. చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వ హక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికి కాకుండా చేసింది ధరణి. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూములను ధరణి పోర్టల్ లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది రైతులు తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. ఆ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది వారి భూములను అమ్ముకోలేక పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు మరియు కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి నానా అగచాట్లు పడ్డారు. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వలన చాలా మంది రైతులకు అందవలసిన రైతుబంధు, రైతుబీమా వంటి ప్రభుత్వ పథకాలు కూడా అందక నష్టపోయారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు ధరణి పోర్టల్ లోని ఎన్నో లోపాలను ఎత్తిచూపింది.
- ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి, 2024 లో, ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనల మేరకు, మొదటి దశలో పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ ను ఈ సంవత్సరం మార్చి 1 నుండి మార్చి 15 వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టాము. మార్చి 1, 2024 నాటికి 2,26,740 ధరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, 1,22,774 కొత్త ధరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఉన్న 3,49,514 ధరఖాస్తుల్లో, మార్చి 1 నుండి నేటి వరకు 1,79,143 ధరఖాస్తులను పరిష్కరించాము.
- నేటికి ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూళ్లను, 10 సమాచార మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మాడ్యూళ్ల వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు కొంత వరకు పరిష్కారం లభిస్తుంది. మేము ధరణి సమస్యల పరిష్కారాల పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటి పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా తగిన చర్యలు తీసుకుంటాం.
- మన రాష్ట్ర జనాభాలో 47.3 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కానీ, మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా 15.8 శాతం మాత్రమే. ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుంది. అందుకే, మా ప్రభుత్వం రైతుకి అవసరమైన అన్ని విధాల చేయూత అందిస్తుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్ లో చేస్తున్నాము. మొత్తం ప్రతిపాదిత బడ్జెట్ లో సింహభాగం అంటే 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారత దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి.
హార్టికల్చర్ – ఆయిల్ పామ్ సాగు - తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు Oil palm Area Expansion under National Mission on Edible Oils – Oil Palm (NMEO-OP) పథకం క్రింద ఆయిల్ పామ్ సాగు రైతులకు అవసరమైన సహాయం అందిస్తాం. 2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 77,857 ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరుగగా, 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
- నాణ్యమైన విత్తనాలు లభిస్తేనే రైతుకి సరైన దిగుబడి వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం నకిలీ విత్తనాల వలన పూర్తిగా నష్ట పోయారు. రైతాంగం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి, నకిలీ విత్తనాల కారణంగా వృధా అవుతుంది. మా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృత నిశ్చయంతో ఉంది. నకిలీ విత్తనాలను అరికడుతూ, నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు నష్టం జరిగే ఎటువంటి చర్యలను మా ప్రభుత్వం సహించదు.
హార్టికల్చర్ కు ఈ బడ్జెట్ లో 737 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పశుసంవర్ధక రంగం - పాడిపశువుల పెంపకం గ్రామీణ ప్రజానీకానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది. పాలు, మాంసం, గుడ్లు ప్రజానీకానికి పోషణ అందించడంతో పాటు, అదనపు ఆదాయం ఇస్తాయి. ఇతర అనుబంధ రంగాలైన చేపలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాయి. ఈ రంగం గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పిస్తూ, అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. పాల ఉత్పత్తి రంగంలో 62 శాతం వాటా చిన్న, సన్నకారు మరియు భూమిలేని పేదలదే. వారు రాష్ట్రంలోని పశుసంపదలో 70 శాతం వాటా పొంది ఉన్నారు. ఈ రంగంలో రాష్ట్రం 326.39 లక్షల పశుసంపదతో దేశంలో 8వ స్థానంలో ఉంది.
పశుసంవర్ధక రంగానికి ఈ బడ్జెట్ లో 1,980 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
అభయహస్తం (6 హామీలు)
మహాలక్ష్మి – ఉచిత రవాణా పథకం - మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి. మహాలక్ష్మి పథకం క్రింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టి.జి.ఆర్.టి.సి నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ప్రయాణించే దూరంపైన, ప్రయాణించే పర్యాయాలపైన ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు, 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్.టి.సి బస్సులలో ఉచితంగా చేశారు. పర్యవసానంగా తెలంగాణ మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా అయ్యింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళ్లలో హర్షాతిరేకాలు వెల్లువిరుస్తున్నాయి. వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను, దేవాలయాలను, బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది. ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.
- ఈ పథకానికి అయ్యే ఖర్చు RTC కి ప్రభుత్వం నెలవారిగా చెల్లిస్తుంది. దీనివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పోరేషన్ గా అవతరించడానికి దోహదపడుతుంది.
రూ.500/- కే గ్యాస్ సిలిండర్ - నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి. వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది. మా ప్రభుత్వం మాహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ ను అందించడం ప్రారంభించింది. ఈ ఫథకం ద్వారా ఇప్పటి వరకు 39,57,637 కుటుంబాలకు లబ్ది చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించింది.
ఈ బడ్జెట్ లో ఈ పథకానికి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
గృహజ్యోతి పథకం
- అల్పాదాయ వర్గాల వారి ఇళ్ళల్లో చీకట్లను పారద్రోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో, మెరుపులాంటి ఆలోచనతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. ఫిబ్రవరి 2024 లో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను, మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి, ఈ సంవత్సరం మార్చి 1 నుండి అమలు చేస్తున్నాం.
- 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ని వినియోగించుకొనే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన-ప్రజా సేవ కేంద్రాల ద్వారా వచ్చిన ధరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికి ఈ ఉచిత విద్యుత్తు పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకం క్రింద అర్హులైన లబ్ధిదారులకు డిస్కంలు సున్నా బిల్లులు జారీ చేస్తాయి. ప్రభుత్వం ఆ బిల్లుల మొత్తం ఛార్జీలను డిస్కంలకు చెల్లిస్తుంది. మార్చి 1వ తేదీ 2024 నుండి గృహజ్యోతి సున్నా బిల్లుల జారీ ప్రారంభమయ్యింది. ఈ పథకం 15 జూలై నాటికి, 45,81,676 ఇళ్లల్లో వెలుగుల జిలుగులు నింపింది.
- గృహజ్యోతి పథకం క్రింద జూన్ వరకు అందించిన విద్యుత్తుకుగాను, డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్ల రూపాయలు చెల్లించింది.
ఈ బడ్జెట్ లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఇందిరమ్మ ఇండ్లు: - రోటీ, కపడా ఔర్ మకాన్ లలో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే. పూటగడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి, వారికి ప్రభుత్వ ఇండ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది.
- అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం “ఇందిరమ్మ ఇండ్లు” అనే నూతన గృహ నిర్మాణ కార్య క్రమాన్ని ప్రారంభించి వారి ఆశలు నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదలు ఇండ్లను కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజక వర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున, మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఆర్.సి.సి (RCC) కప్పుతో వంట గది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి.
- రెండు పడక గదుల ఇండ్ల పథకం క్రింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తికాని ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించి అర్హులకు అందజేస్తాం. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతాయి.
ప్రజాపంపిణీ వ్యవస్థ: - మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు. మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. అందుకే, మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకున్నాము. ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైతుల సౌకర్యార్థం 2024 రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచడం జరిగింది.
- 2023-24 రబీ సీజన్ కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి 25 నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలను నెలకొల్పాం. వర్ష సూచనను, వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియచేసే వాతావరణ యాప్ ను అభివృద్ధి చేసి రైతులను అప్రమత్తం చేస్తూ, పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం.
- గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు. కానీ, మేము ఈ చెల్లింపులు 48 గంటల్లోనే చేస్తున్నాం. దానివల్ల రైతుకి పైకం వెంటనే చేతికి వచ్చి అక్రమాలకి అడ్డుకళ్లెం పడుతుంది. ఇప్పటి వరకు 10,556 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.
- 2010-11 నుండి 2022-23 సంవత్సరాల మధ్య సుమారు 1,000 మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్లు బకాయి పడ్డారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతో మంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు. ఇది అందరి కళ్ల ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ దీనిని అరికడదామనే ఆలోచన చేయలేదు సరికదా, వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది.
- ఈ విషయంలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. గత ఆరు నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టింది. ప్రభుత్వ కృషి వలన గత ఆరు నెలల్లో బకాయిపడ్డ కస్టమ్ మిల్లర్స్ నుండి 450 కోట్లు వసూలు చేసాం. 509 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి 60 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాం.
- గత ఆరు నెలల నిరంతర పర్యవేక్షణా చర్యల వలన FCI కి డెలివరీలు వేగవంతమై 36 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) ధాన్యం ఇచ్చాము. చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి, కేంద్ర ప్రభుత్వంతోనూ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతోనూ, వ్యవహరించడానికి క్రొత్త వ్యూహాలను అనుసరించాము. గత మూడు నెలల్లో ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎఫ్.సి.ఐ నుండి 3,561.64 కోట్ల రూపాయలను సాధించుకోగలిగాము. అలాగే, 1,323.86 కోట్ల రూపాయల బకాయి పడ్డ రుణాన్ని తగ్గించుకోగలిగాము. మేము మొదలు పెట్టిన ఈ ప్రయత్నాల వల్ల పౌర సరఫరాల శాఖ సేవలు ఇప్పటికే ఎంతో మెరుగయ్యాయి.
ప్రజాపంపిణీకి ఈ బడ్జెట్ లో 3,836 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పంచాయితీరాజ్ -గ్రామీణాభివృద్ది: - మహాత్మాగాంధి పేర్కొన్న విధంగా భారత దేశ ఆత్మ దాని గ్రామాలలో కనిపిస్తుంది. కానీ, గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ నిర్లక్షం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. కేవలం క్రొత్త గ్రామ పంచాయతీలను ఏర్పరిచి వాటికి ఎటువంటి ఆర్థిక వనరులు కల్పించక పోవడంతో ఆ గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధికి నోచుకోలేదు.
- గ్రామ స్వరాజ్యానికై నిరంతరం కృషి చేసి గ్రామీణాభివృద్ధికి జవసత్వాలను నింపిన శ్రీమతి ఇందిరా గాంధి, శ్రీ రాజీవ్ గాంధీ చూపిన బాటలోనే నడవాలని మా ప్రభుత్వ సంకల్పం. ప్రతి గ్రామాన్ని సమగ్రాభివృద్ధి కేంద్రంగా మలచాలన్నది లక్ష్యం. గ్రామాలలో స్థానిక స్వపరిపాలన సజావుగా సాగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పక్కా రోడ్లు లేని మారు మూల గ్రామాలకు మరియు నివాస ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాన్ని చేపడుతాం.
- గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది. విధాన నిర్ణయాలలో, అమలులో చోటు చేసుకున్న లోపాల వల్ల, పైప్ లైన్లకు, స్టోరేజ్ ట్యాంక్ లకు, పంపింగ్ కు సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత త్రాగునీటి సౌకర్యం లేదు.
- ఈ సంవత్సరం జూన్ లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి కొరకు సురక్షిత నల్లాలు లేని జనవాసాలను, గృహాలను గుర్తించడానికి ఒక సమగ్ర సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో లక్షలాది గృహాలకు నల్లా కనెక్షన్లు లేవని గుర్తించారు. ఈ సర్వే ఫలితాలతో మిషన్ భగీరథ గురించి గత పాలకులు చెప్పిన గొప్పలు భ్రమలే అని రుజువైంది. మిషన్ భగీరథలో బయటపడ్డ లోపాలను సవరించి, రాష్ట్రంలో వంద శాతం గృహాలకి సురక్షిత త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం.
- మా ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత త్రాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే, వేసవి తీవ్రతను పసిగట్టి ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి, గ్రామ పంచాయితీ నిధి నుండి మరియు 15 వ ఆర్థిక సంఘం కేటాయింపుల నుండి తగినంత మొత్తాన్ని సమీకరించి త్రాగు నీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించగలిగాం. కర్ణాటక రాష్ట్రాన్ని సంప్రదించి నారాయణ పూర్ డ్యాం నుండి రెండు టిఎంసిల నీటిని రాబట్టుకోగలిగాం. కొత్త బోర్లను, హ్యండ్ పంపులను సమకూర్చి ములుగు, భద్రాద్రి జిల్లాల లోని 35 గుత్తికోయ నివాసాలకు త్రాగునీటిని సరఫరా చేసి చిరకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించాం. నీటి వసతులకు సంబంధించిన వివిధ నిర్మాణాల నిర్వహణ మరియు మరమ్మత్తులను గ్రామ పంచాయితీల పరిధిలోనికి తీసుకురావాలని నిర్ణయించాం.
- భవిష్యత్తులో అన్ని గ్రామాల ప్రజలకు నల్లాల ద్వారా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం, గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు, పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ఇతర ప్రభుత్వ కేంద్రాలకు త్రాగునీటిని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం.
ఇందిరా మహిళా శక్తి పథకం - “మహిళలు సాధించిన ప్రగతే, ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను” (I measure the progress of the community by the degree of progress which women have achieved—Dr.B.R.Ambedkar) తెలంగాణా ప్రభుత్వం 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో “ఇందిరా మహిళా శక్తి” పథకానికి రూపకల్పన చేసింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం.
- ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లలో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు (VOs)/ ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి, రాబోయే 5 సంవత్సరాల్లో 25,000 సంస్థలకు విస్తరింపచేయడానికి కృషి చేస్తాం.
- దీనితో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా, రుణబీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకం క్రింద సభ్యురాలు మరణించినపుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుంది. దీనిని అమలు పరచడానికి 50.41 కోట్ల రూపాయల నిధులు కేటాయించాం.
స్వయం సహాయక సంఘాలు - ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో, నిధుల లేమితో కుంటుపడ్డాయి. పేద, మధ్యతరగతి మహిళాభ్యున్నతికి ఆర్థిక స్వాలంబనకు సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి. వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం 20 వేల కోట్లకు తగ్గకుండా, వచ్చే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులు మైక్రో, స్మాల్ ఇండిస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళలు పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి.
ఇందిరా జీవిత బీమా పథకం - ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాము. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా చేయడం జరిగింది.
- స్కూల్ యూనిఫాంలను కుట్టే పనిని స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు అప్పజెప్పాలని పాఠశాల విద్యా శాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థనల మేరకు స్కూల్ యూనిఫాంల కుట్టు చార్జీలను జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. దీనివల్ల, 29,680 మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల రూపాయల లబ్ది చేకూరుతుందని అంచనా.
- స్వయం సహాయక బృందాలలోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజారు కాంప్లెక్స్ ను అప్పగించాం.
- మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే. సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో 29,816 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
హైదరాబాద్ నగరాభివృద్ధి - దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్ గా పేరు గడించింది. ఈ నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవలను మనము మర్చిపోలేము. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య, మురుగు నీటి, తాగునీటి వ్యవస్థలు గత పదేళ్ళుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైయ్యాయి. మితిమీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగర్ లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో, ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజాజీవనం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి దాపురించింది. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడిముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. కేవలం కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు. హైదరాబాద్ లో భూముల వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా, వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరుగలేదు.
- హైదరాబాద్ చుట్టు ప్రక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటి సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో పని చేసే వారు హైదరాబాద్ నగరం మరియు శివారు ప్రాంతాలలో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ట్రాఫిక్ రద్ధీ తగ్గడం, సమయం ఆదా అవడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది. అంతే కాకుండా, హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలన్ని కూడా సెల్ఫ్ సస్టేనింగ్ (Self Sustaining) ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు, సేవలు సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది. శాటిలైట్ టౌన్ షిప్ ల నిర్మాణం హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రోత్సహించాలనేది మా ప్రయత్నం. ఈ టౌన్ షిప్ లలో సరసమైన ధరలలో పేద మరియు మధ్యతరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలను ప్రోత్సహిస్తాము. టౌన్ షిప్ లలో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు, కమ్యూనిటీ హాలులు, వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు మొదలైనవి ఉండేటట్టు ప్రణాళిక రూపొందిస్తున్నాము.
- హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ట్రాఫిక్ స్థంభన. ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. దానిలో మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైనది. ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది.
- మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి, వాటిని సవరించి, క్రొత్త ప్రతిపాదనలను రూపొందించింది. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, ప్రభుత్వం 78.4 కి.మీ. పొడవు వున్న ఐదు ఎక్స్టెండెడ్ (extended) కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో రైలును పాత నగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రాయానికి అనుసంధానం చేస్తాము. అలాగే, ప్రస్తుతమున్న కారిడార్లను నాగోలు నుండి ఎల్.బి.నగర్ వరకు విస్తరిస్తాం. నాగోలు, ఎల్.బి నగర్ మరియు చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తాం. మియాపూర్ నుండి పటాన్ చెరువుకు, ఎల్.బి.నగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం.
హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ (HYDRAA): - రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల ప్రాంతాలను కోర్ ఆర్బన్ రీజియన్ గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ ప్రాంత జనాభా రాష్ట్ర జనాభాలో 48.6 శాతంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక మరియు జి.ఎస్.డి.పి పురోగతిలో ఈ ప్రాంతం అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా వృద్ధిరేటు సాలీనా 3.2 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ఐ.టి, ఫార్మా, డిఫెన్స్, ఎరోస్పేస్ లకు సంబంధించిన పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందడం వల్ల హైదరాబాదు నగర శివారులలో పట్టణీకరణ వృద్ధిరేటు అత్యధికంగా కనిపిస్తుంది. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ నగరాభివృద్ధికి చేసిన కృషికి ఫలితం.
- ఒక రకంగా ఔటర్ రింగు రోడ్డును నగర సరిహద్దుగా పరిగణించవచ్చు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలో హైదరాబాద్ నగరంతో పాటు, ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాల మధ్య పౌర సేవలలో సామ్యత లేదు. జి.హెచ్.ఎం.సి లో ఒక విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఓ.ఆర్.ఆర్ పరిధిలో ఉన్న ఇతర పట్టణ ప్రాంతాలలో ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం లో (Telangana Core Urban Region) విపత్తుల నిర్వహణ కోసం ఒక ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జి.హెచ్.ఎం.సి తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు ఈ TCUR పరిధిలోకి వస్తాయి.
- పట్టణ విపత్తులను నివారించడానికి, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవల్సిన చర్యలను చేపట్టడంతో పాటు, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకొనే విషయంలో జాతీయ, రాష్ట్రేతర సంస్థలతో సమన్వయం సాధించడం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ (HYDRAA) చేస్తుంది. ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఈ సంస్థ పాలక మండలికి (Governing Authority) రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. ఈ సంస్థ నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వ కేటాయింపు ద్వారాను, లబ్ధిదారులైన స్థానిక సంస్థల వాటాల ద్వారాను సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ సంస్థ వల్ల విపత్తుల నివారణ, నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుంది.
మూసీనది ప్రక్షాళన: - మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా, మూసీ నదీ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాము. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కి.మీ. పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది. అలాగే, నదీ తీర ప్రాంతంలో క్రొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు వెలిసి, పాత హెరిటేజ్ ప్రాంతాలు క్రొత్తదనాన్ని సంతరించుకుంటాయి.
- మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలను కల్పించుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్ లు, పాదచారుల జోనులు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ ధీమ్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోనులు అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు – ఆర్థిక కూడలి ఏర్పాటు, జీవన ప్రమాణాల పెరుగుదల, వారసత్వ-సాంస్కృతిక సంపదను పరిరక్షించడం, నగర ప్రతిష్టను ఇనుమడింపజేయడం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, పర్యావరణాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం.
- ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే, సామాజిక ఆర్థిక/అనుభవ సర్వే (socio economic/ enjoyment survey) ను చేపట్టడానికి, రెవెన్యూ శాఖలో 33 బృందాలను ఏర్పాటు చేశాం. మూసీ అభివృద్ధి లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాలో జరుగుతుంది. ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్ గా జరగాలనేది మా ప్రయత్నం, జరుగుతుందనేది మా ప్రగాఢ విశ్వాసం.
హైదరాబాద్ నగర పాలక సంస్థ మరియు మెట్రో పాలిటన్ అబివృద్ధి సంస్థ - హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్ద పీట వేయాలని ప్రభుత్వ ఉద్దేశం. కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్ధవంతంగా అందించడంలో GHMC, HMDA, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు GHMC పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, HMDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్ కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రా కి 200 కోట్లు, ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టి మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం.
- తెలంగాణకి ఆర్థికంగా ఆయువు పట్టు అయిన హైదరాబాద్ సమగ్రాభివృద్ధి సాధించినపుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున 10 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము.
రీజనల్ రింగు రోడ్డు - ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయటంతో హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతమయ్యింది. ఇలాంటి ఫలితాలను రాష్ట్రం లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ (RRR) దోహదపడుతుంది.
- ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–తూప్రాన్ – గజ్వేల్ – చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. రీజినల్ రింగు రోడ్డు హైదరాబాదు నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయ రహదారి నెట్ వర్కు తో అనుసంధానం చేయబడుతుంది. ఎక్స్ ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరింపజేస్తాం. ఈ ప్రాజెక్టు వల్ల ఓ.ఆర్.ఆర్ (ORR) కు ఆర్.ఆర్.ఆర్ (RRR) కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీని కోసం ఈ బడ్జెట్ లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
స్త్రీ, శిశు సంక్షేమం - బాలబాలికలకు పౌష్టికాహారాన్ని అందించటంతో పాటు, విద్యను కూడా అందించాలనే సంకల్పంతో, అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మార్చాలని నిర్ణయించాం. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి, పాఠశాలల నిర్వహణను అప్పగిస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పారిశుధ్యం, మరమ్మత్తులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలని మా లక్ష్యం. స్త్రీ, శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో 2,736 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమం - “ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది” – మహాత్మగాంధీ (I understand democracy as something that gives the weak the same chance as the strong-Mahatma Gandhi).
- మహాత్మగాంధీ నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పటికే, మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పోరేషన్, లంబాడాల కొరకు సంత్ సేవాలాల్ కార్పోరేషన్, ఎరుకుల కొరకు ఎరుకుల కార్పోరేషన్ ఏర్పాటు చేసింది. అదే విధంగా షెడ్యూల్డ్ కులాలైన మాల, మాదిగలకు రెండు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్పోరేషన్ల ద్వారా ఈ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతాం.
- ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగులు వంకలు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు, తాండాలకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఆ సమయంలో అత్యవసర వైద్య సహాయం రోగులకు, గర్బిణీ స్త్రీ లకు అందించడం ఒక సాహస కార్యం కన్నా తక్కువేమి కాదు. మామూలు సందర్భాలలో కూడా ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు చిన్న చిన్న పనులకు కూడా పక్క ప్రాంతాలకు వెళ్లడానికి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రయాణం చేయవలసి వస్తుంది. అందుకే, అలాంటి మారుమూల ప్రాంతాలన్నింటికి సరియైన రోడ్డు సౌకర్యం కల్పించగలిగితే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని మూలల్లో రోడ్డు సౌకర్యం లేని షెడ్యూల్డ్ తెగల తాండాలు, గూడాలు మరియు చెంచు పెంటలకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనివల్ల, వారి దైనందిన జీవితం సులభతరం అవుతుంది.
- గత ప్రభుత్వం 500 పైన జనాభా కల్గిన షెడ్యూల్డ్ తెగల నివాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. అక్కడితో వాటిని మర్చిపోయింది. వారికి అవసరమైన కనీస సదుపాయాలు ఇప్పటికీ లేవు. వాటిని అభివృద్ధి పరిచే దిశగా మా ప్రభుత్వం ఈ క్రొత్త పంచాయతీలన్నింటికి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టించాలని సంకల్పించాం.
- గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, పండగలు అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటిని పాటిస్తూ, కాపాడుకోవడానికి వారు ప్రాధాన్యం ఇస్తారు. అది పరిరక్షించడం మన బాధ్యత కూడా. అందుకే, ఆసియాలోనే అతి పెద్దదైన సమక్క సారాలమ్మ మేడారం జాతరని అత్యంత వైభవంగా ఫిబ్రవరి, 2024 లో 100 కోట్లతో నిర్వహించాము. అంతే కాకుండా సంత్ సేవాలాల్ జయంతి కూడా రెండు కోట్లు, నాగోబా జాతర నిర్వహణకి కోటి రూపాయలు మంజూరు చేశాం.
- రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడానికి నిర్ణయించింది. ఒకే ప్రాంతంలో వేరు వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బి.సి, మైనార్టీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను, 20 ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తాం. ఆ పాఠశాలలకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. దీనితో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య సంఘీభావం మరియు స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఏర్పడి అందరికీ అత్యున్నత ప్రామాణిక విద్య అందుతుంది.
- షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించాల్సిన నిధులు ఖచ్ఛితంగా అందిస్తాం. ఆ నిధులు వేరే ఎటువంటి పథకాలకు మళ్లించకుండా వంద శాతం షెడ్యూల్డ్ కులాల, తెగల కోసమే ఉపయోగిస్తాం. ఎస్సీ సంక్షేమం (SCSDF) కొరకు ఈ బడ్జెట్ లో 33,124 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం (STSDF) కొరకు ఈ బడ్జెట్ లో 17,056 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
మైనార్టీ సంక్షేమం - మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. దానిని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25 లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం. శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ అభ్యర్థులకు నెలకు 2,500 రూపాయలు నాన్ లోకల్ అభ్యర్థులకు, 5,000 రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తున్నాము.
- ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు 33 కోట్ల రూపాయలు మరియు అషూర్ ఖానాల పునరుద్ధరణకు, నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. జనవరి, 2024 లో జరిగిన తబ్లీగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు 4.43 కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం.
మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
బి.సి సంక్షేమం: - మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి వికాసానికి పలు పథకాలను ప్రవేశపెడుతున్నాం.
- కల్లుగీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. కల్లు గీసే క్రమంలో వారు తరుచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు. అటువంటి పరిస్థితులలో వారి కుటుంబం మొత్తం ఆర్ధిక ఇబ్బందులలోకి నెట్టబడుతున్నారు. అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి, హైదరాబాద్ వారు తయారు చేసారు. ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్లు గీత కార్మికులకు అందచేయాలని నిర్ణయించాం. ఈ కిట్ యొక్క డెమో (Demo) ఈ మధ్యనే అధికారులు కల్లు గీత కార్మికుల సమక్షంలో పరిశీలించారు.
- ప్రభుత్వం క్రొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది. ఆర్ధికంగా వెనుకబడిన కులాల (EBC) సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కార్పోరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడుతాయి.
- సమాజంలో అందరు అభివృద్ధి చెందాలి మరియు సమాన అవకాశాలు పొందాలి అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాకుండా, కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకుని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు. ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు. దానికనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మానిఫెస్టోలో వెనుకబడిన తరగతుల కుల గణన చేపడతామని ప్రకటించింది. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జీవన ప్రమాణాన్ని సామాజిక, ఆర్ధిక, విద్య మరియు రాజకీయ రంగాలలో మెరుగుపరచడానికి అనుగుణంగా అనువైన పథకాలు రూపకల్పనకు, నిధుల కేటాయింపులకు ఈ కులగణన ప్రామాణికం అవుతుంది. మహాత్మగాంధీ మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న సామాజిక న్యాయం మరియు సమ్మిళిత వృద్ధి (inclusive growth) సాధించేందుకు ఈ కుల గణన దోహదం చేస్తుందని మా నమ్మిక. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 9,200 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
వైద్యం- ఆరోగ్యం - ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. పైపెచ్చు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది. ప్రకటనలకే పరిమితమైన గత ప్రభుత్వం కనీసం ఈ రంగంలో పని చేసే డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదు. ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఘన చరిత్ర కలిగిన సంస్థని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. క్రొత్త మెడికల్ కాలేజీలు సాధించుకొచ్చాం అని చెప్పడం తప్ప వాటికి కావలసిన వనరులు, వసతులు ఏమీ కల్పించలేదు.
- మా ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా దానిలో పని చేసే ఉద్యోగులందరికి ధైర్యం కల్పించేలా వారి వేతన బకాయిలన్నీ విడుదల చేశాం. మున్ముందు కూడా వారికి ప్రతినెల సకాలంలో జీతాలు అందించి వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రజా సేవకే వినియోగించేలా ప్రోత్సహిస్తాం. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఇతర హాస్పటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. క్రొత్త మెడికల్ కాలేజీలకి అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని మంజూరు చేశాం. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 6,956 మంది నర్సులకు నియామక ఉత్తర్వులు ఇచ్చాం.
- ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ (Universal Health Care) విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది.
- ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరచాం. మా ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న 5 లక్షల కవరేజి పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచాం. అంతే కాకుండా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లో ఉన్న 1,672 చికిత్సలలో, 1,375 చికిత్సలకు ప్యాకేజి ధరలను సగటున 20 శాతం పెంచాం. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ దాని పరిధిని విస్తరించాం.
- ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవలు పౌరులందరికీ అందుబాటులోనికి తెచ్చేందుకు, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశ పెడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించే ఈ క్రొత్త డిజిటల్ పద్ధతి వల్ల చెల్లాచెదురుగా అనేక చోట్ల ఉన్న, పౌరుని అరోగ్య సంబంధ సమాచారం, ఒకే చోట లభ్యం అవుతుంది. తద్వారా సులభంగా రోగ నిర్ధారణ చేసి, వారికి సత్వరం చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది.
- అంతేకాక, దశలవారీగా దంత, నేత్ర, చెవి ముక్కు గొంతు మరియు మానసికారోగ్య సంరక్షణ, వాటికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
వైద్య మరియు ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్ లో 11,468 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
విద్యుత్ రంగం - వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోని వినియోగదారులతో పాటు, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గత ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణా రాహిత్యానికి బలైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ, తీవ్ర వేసవి కాలంలో కూడా రోజుకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ను అందించాం. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు.
- శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండును దృష్టిలో పెట్టుకుని, ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించి నెట్ వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్ ట్రా హై టెన్షన్ (EHT) సబ్ స్టేషన్ల నిర్మాణం మరియు 31 ఎక్స్ ట్రా హై ఓల్టేజ్ (EHV) పవర్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం 3,017 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్దం చేయడం జరిగింది.
- రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాలలో స్టోరేజ్ ప్లాంటులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతమున్న 450 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఉండగా, అదనంగా గ్రేటర్ హైదరాబాదులో 100 స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు చార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులోనికి తీసుకురావడానికి TGEV మొబైల్ యాప్ ను ఏర్పాటు చేస్తున్నాం.
- రాష్ట్ర విద్యుత్ వినియోగ అవసరాల దృష్ట్యా 2030 సంవత్సరం వరకు కావలసిన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నాము. సాంప్రదాయేతర మరియు కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకుని వస్తాం. మన రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా, మిగులు విద్యుత్ సాధించడానికి ఈ పాలసీలో తగిన ప్రణాళిక ఉంటుంది.
- పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయం. తదనుగుణంగా మేము తీసుకువచ్చే నూతన విద్యుత్ విధానంలో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్తులో కాలుష్యరహిత విద్యుత్ సాధనలో అగ్రగామిగా నిలవడానికి కృషి చేస్తున్నాం. ట్రాన్స్ కో మరియు డిస్కంలకి ఈ బడ్జెట్ లో 16,410 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
అడవులు-పర్యావరణం - తెలంగాణా రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది. ఎన్నో సుందర జలపాతాలు, వన్య జీవులు, డ్యాంలు (ఆనకట్టలు), జలాశయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించుకుంటూ, వాటిని మరింత విస్తృతపరచి, అటవీ వైశాల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు, అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో-టూరిజమ్ (పర్యావరణ పర్యాటకం) ను పెంపొందించాలని నిర్ణయించాం. పటిష్టమైన ఇకో-టూరిజం విధానాన్ని రూపొందించడానికి అటవీశాఖ మంత్రి వర్యుల అధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒడిశా, కర్ణాటక, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించి, వారనుసరించే ఉత్తమ పద్ధతులను సేకరించి ఇచ్చే నివేదిక ఆధారంగా ఇకో-టూరిజం పాలసీని రూపొందించి అమలు చేస్తాం.
- ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాలు – అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్ -అనంతగిరి సర్క్యూట్, ఖమ్మం లోని కనకగిరి, అదిలాబాద్ లోని కుంటాల జలపాతం, కొత్తగూడెంలోని కిన్నెరసాని, పాకాల మరియు ఏటూరునాగారం సర్క్యూట్ లను గుర్తించాం. ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరుతాయి.
- ఈ ఏడాది 20.02 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో ప్రభుత్వం “వజ్రోత్సవ వన మహోత్సవం” కార్యక్రమాన్ని ప్రారంభించింది. మానవులకు, జంతువులకు మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది. దీని వల్ల, అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఒక భరోసా ఉంటుంది. అడవులు మరియు పర్యావరణ శాఖకి ఈ బడ్జెట్ లో 1,064 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
పరిశ్రమలు – ఇన్ఫర్మేషన్ టెక్నాలజి
తెలంగాణా నైపుణ్యాభివృద్ది విశ్వవిద్యాలయం - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణాను తీర్చిదిద్ది, స్థానికంగాను, విశ్వవ్యాప్తంగాను, సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణా యువకుల్లో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ధ్యేయంతో తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్ లో పబ్లిక్ -ప్రైవేటు భాగస్వామ్యంతో “తెలంగాణా నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని” (Skills University of Telangana) స్థాపించి, నడిపించాలని నిర్ణయిచింది. ఈ విశ్వవిద్యాలయంలో, 17 వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ కోర్సులు ప్రారంభమౌతాయి. నేరుగా పరిశ్రమలతో అనుసంధానింపబడి, అధ్యయన – ఆచరణల మధ్య అంతరం లేని విధంగా, ఉద్యోగార్జనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తాము.
కృత్రిమ మేధో పరిజ్ఞానం (Artificial Intelligence) - తెలంగాణ, కృత్రిమ మేధో పరిజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, హైదరాబాద్ ను ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము. మన నగరం, భవిష్యత్తులో ఏ.ఐ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధక కేంద్రంగా రూపొందుతుంది.
- తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్ లో ఈ సెప్టెంబర్ 5,6 తేదీల్లో జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది. “కృత్రిమ మేధో పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి” (Making AI work for everyone) అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు, ప్రభావశీలురు మొదలైన వారు 2,000 మంది హాజరౌతారు. ఈ సమావేశం ఎఐ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహద పడుతుంది.
ఫైబర్ గ్రిడ్
- తెలంగాణ లో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దానిని విస్తరిస్తాం. దీనివల్ల ఆ ప్రాంతాలలో ఇంటర్ నెట్ మరియు కేబుల్ నెట్ వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహద పడుతుంది.
నిజాం షుగర్స్ లిమిటెడ్ అభివృద్ది - ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్స్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకుల కారణంగా మూత పడింది. దీనిని ఇప్పటివరకు ఎవరు పట్టుంచుకోలేదు, దానిని పునరుద్దరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్దరణకు జనవరి, 2024 లో ఒక కమిటీని నియమించాము. త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అయిన నిజాం షుగర్స్ లిమిటెడ్ ను తిరిగి ప్రారంభిస్తాం.
చేనేత రంగం - మన చేనేతన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం. గతంలో ఎంతో ప్రాభవం కలిగిన ఈ రంగం, తక్కువ ధరలలో, తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది. ఈ రంగానికి చేయూతనిచ్చి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించి పోయే ప్రమాదం ఉంది. మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలకి, ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు అనగా, విద్యార్థులకిచ్చే స్కూల్ యూనిఫాంలు, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్ షీట్లు లాంటివి, తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నేతన్నల నుండే సేకరించాలని నిర్ణయించాము.
- గత ఏడు సంవత్సరాలుగా, తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హండ్లూమ్ టెక్నాలజి (IIHT) ఏర్పాటు విషయం పెండింగ్ లో ఉంది. మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ (Institute) ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్ టైల్స్ (Centre of Excellence for Technical Textiles) ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్ లో 2,762 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కి ఈ బడ్జెట్ లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
నీటి పారుదల రంగం. - రాష్ట్రంలో ఈనాటి వరకు 34 భారీ, 39 మధ్యతరహా మొత్తం 73 నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. వాటిలో 42 ప్రాజెక్టులను (10 భారీ మరియు 32 మధ్యతరహా) పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం 24 భారీ మరియు 7 మధ్యతరహా మొత్తం 31 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
- గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లలో లోపాలు, నాణ్యతా రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసాయి. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్భాట ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొద్దికాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని నియమించాము. ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చుపెట్టిన వేల కోట్ల ప్రజా ధనం వృధా అవ్వకుండా ప్రాజెక్టును కాపాడడానికి National Dam Safety Authority వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాము.
- గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణలలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల, ఎంతో ప్రజాధనం ఖర్చు అయ్యి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో, మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం.
- రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ, మధ్యతరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగకపోవడం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరుగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మత్తులను తగిన సమయంలో చేపట్టడానికి నిశ్చయించాము. నీటి పారుదల శాఖకి ఈ బడ్జెట్ లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
విద్యారంగం - “నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది” (A Good Education is a foundation for better future). ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పఠిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తాం. మొదటి అడుగుగా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయించి, 11,062 పోస్టులతో ఒక మెగా డిఎస్ సి (DSC) ఇప్పటికే నోటిఫై చేశాం. దానికి సంబంధించిన పరీక్షలు జులై 18, 2024 నాడు ప్రారంభమై ఇంకా జరుగుతున్నాయి. దీనివల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది, నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది.
- గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాలరాసింది. వాటికి చాలా కాలం పూర్తికాలపు వైస్ ఛాన్సలర్ నియమించకుండా ఇంఛార్జిల నియామకంతో కాలం గడిపింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైనది. మా ప్రభుత్వం ఇటీవల పూర్తికాలపు వైస్ ఛాన్సలర్ లను నియమించడానికి సెర్చ్ కమిటీలను నియమించాం. త్వరలోనే ఈ నియామకాలు పూర్తి చేస్తాం. విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకై 500 కోట్ల నిధులు ప్రతిపాదిస్తున్నాము. దీనిలో వంద కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకు, మరో వంద కోట్లు మహిళా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకు ప్రతిపాదించాం. మిగతా నిధులు కాకతీయ మరియు ఇతర విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాల కల్పనకై ప్రతిపాదిస్తున్నాము.
- “సంపదవల్ల మాత్రమే సమర్థత రాదు. కానీ, సమర్థత వల్ల సంపద మరియు మిగతావన్నికూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఇది వ్యక్తులకైనా, సమాజానికైనా సమానంగా వర్తిస్తుంది” (Wealth does not bring excellence, but excellence makes wealth and everything else good for men, both individually and collectively-Socrates) అందుకే మేము అన్ని రంగాలలో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో భాగంగానే 65 ప్రభుత్వ ఐ.టి.ఐ లను ప్రయివేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికలో భాగంగా, ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకి తగ్గట్టుగా ఆరు కొత్త దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెడుతున్నాము. 5,860 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ కోర్సులలో శిక్షణ పొందుతారు. స్వల్పకాల కోర్సులలో ప్రతి సంవత్సరం 31,200 విద్యార్థులకి శిక్షణ లభిస్తుంది.
- ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటిఐలలో ఆధునిక, సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి. వాటిపై శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాము. ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్థులకి, ఉద్యోగార్థులకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టును మల్లేపల్లి ఐ.టి.ఐ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్టు అయ్యే మొత్తం ఖర్చు 2,324 కోట్ల రూపాయలు. దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 307.95 కోట్ల రూపాయలు. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థలవారు వారి CSR కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు. ఈ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. విద్యరంగానికి ఈ బడ్జెట్ లో 21,292 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
శాంతి భద్రతలు - శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ప్రశాంతతకు మరియు రాష్ట్రాభివృద్ధికి అత్యవసరమైన అంశం. అభద్రతా వాతావరణంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించవు. టెక్నాలజీ అభివృద్ధితో నేరప్రవృత్తి పలు రూపులు దాల్చుతోంది. సాధారణ నేరాలు అరకట్టడంతో పాటు వైట్ కాలర్ క్రైమ్స్, సైబర్ నేరాలు అరికట్టడం పోలీసు వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. నేరస్తులను దీటుగా ఎదుర్కొని, నేర నివారణకు పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగానికి అవసరమైన వాహనాలను ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. నేరాలను ఛేదించేందుకు, ఆధునిక నేర పరిశోధనలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నాము. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇంతకు ముందు ప్రజలకు కేవలం నాలుగు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో మాత్రమే సదుపాయం ఉండేది. కానీ మా ప్రభుత్వం ఈ ఫిర్యాదులను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాము. ఆన్ లైన్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి వెబ్ సైట్ మరియు టోల్ ఫ్రీ నెంబర్ కి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం.
- CRPC/IPC/Indian Evidence Act స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన క్రొత్త చట్టాలపై సరైన అవగాహన కొరకు, సమర్థవంతంగా విధినిర్వహణకు పోలీసు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించాము.
మాదక ద్రవ్యాల పై ఉక్కు పాదం - మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం. యువత దీని బారిన పడ్డప్పుడు దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. మా ప్రభుత్వం ఈ సమస్యను గ్రహించి అధికారంలోనికి వచ్చినప్పటినుంచి మాదక ద్రవ్యాల నియంత్రణకు ఒక జీరో టాలరెన్స్ (Zero Tolerance) పద్దతిని అనుసరిస్తుంది. మాదక ద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగాలపై ఉక్కు పాదం మోపి రాష్ట్ర ప్రజలను, అందులోనూ ముఖ్యంగా విద్యార్థులను, ఈ మహమ్మారి బారి నుండి కాపాడడానికి వివిధ చర్యలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది. మాదకద్రవ్యాల రవాణ మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా, పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించ వద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.
- తెలంగాణా మాదకద్రవ్య నిరోధక సంస్థ (టీ.జి. న్యాబ్ – TG ANB) ను బలోపేతం చేసి, ఆ బ్యూరో కు తగిన సౌకర్యాలు కల్పించాం. ఇటీవలే ఈ బ్యూరో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కార్యక్రమాల గుట్టును రట్టు చేసింది. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని విద్యాసంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించేటట్లు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్ధులకు అవగాహన కల్పించేటట్లు కార్యచరణ చేపట్టాం. విద్యాసంస్థలలో మాదకద్రవ్యాల కట్టడికి Anti Drug Committees ఏర్పాటు చేసి, 4,137 విద్యార్థులను Anti Drug Soldiers గా నియమించాము. మాదకద్రవ్యాల వల్ల జరిగే హాని పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సినీరంగ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. దీనివల్ల నిందితులకు త్వరితగతిన శిక్షలు పడి, మాదక ద్రవ్య సంబంధిత కార్యకలాపాలకు పాల్పడే వారికి జంకు కలుగుతుంది. తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు, తమ పిల్లలు డ్రగ్స్ నుండి దూరంగా, సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. మా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా (Drugs free State) చేస్తామని వాగ్దానం చేస్తుంది.
హోం శాఖకి ఈ బడ్జెట్ లో 9,564 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
రోడ్లు మరియు భవనాలు - ఆధునిక ప్రపంచంలో రహదారులే ఆర్థిక వృద్ధికి జీవ నాడులు. అందుకే తెలంగాణలో సమగ్ర రహదారుల పాలసీ తయారు చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి తారు రోడ్డు వేయడం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రహదారుల నిర్మాణం, జిల్లా కేంద్రం నుంచి రాజధానిని అనుసంధానించేలా హైవేల నిర్మాణం చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం.
- గత దశాబ్దకాలంగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంట్ లోని రోడ్ల విస్తరణకు మరియు ఎలివేటడ్ కారిడార్ల నిర్మాణానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి రక్షణ శాఖ వారితో సంప్రదించి దానికి కావలసిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందడం జరిగింది. నిజంగా ఇది హైదరాబాద్ మరియు రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. రోడ్లు మరియు భవనాల శాఖకి ఈ బడ్జెట్ లో 5,790 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
గౌరవ అధ్యక్షా - చివరగా మహాత్మగాంధి గారి మాటలు నేను ఈ గౌరవ సభకు గుర్తు చేయాలనుకుంటున్నాను. “మనము చేసే పనులకు, చేయగలిగే సామర్ధ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి సరిపోతుంది”. (The difference between what we do and what we are capable of doing would solve most of the World’s problems). మనకు ఎంతో సామర్థ్యం ఉండి కూడా మనం దానిని వంద శాతం వినియోగించం. ప్రజల కష్టాలను తీర్చాలనే మహోన్నత సంకల్పం ఉంటే మన శక్తిని పూర్తిగా ఉపయోగించడానికి అది ఉపకరిస్తుంది. ఈ స్ఫూర్తి తోనే మా ప్రభుత్వం పని చేస్తుంది.
2024-25 బడ్జెట్ అంచనాలు - 2024-25 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను.
- 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సభ ఆమోదం కోసం ప్రవేశ పెడుతున్నాను.
జై తెలంగాణ……. జై హింద్…….
It is my extreme pleasure and privilege to introduce the first Full Budget of the Telangana Congress Government.
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 25, 2024
My heartfelt thanks to Smt. Sonia Gandhi ji, who made the Telangana dream envisioned by the great poet Dasarathi a reality. ( నా తెలంగాణ కోటి రతనాల వీణ )
The people… pic.twitter.com/lx7viaapPt