వచ్చేపార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ఇకనుండి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా యాత్రలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో పదిహేడుకు 17 ఎంపీ సీట్లు గెలవాలనే ఏకైక లక్ష్యంతో లోక్ సభ ఎన్నికలకు కమలనాధులు సిద్దమవుతున్నారు. కేంద్రంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ఈనెల 20నుండి విజయ సంకల్ప యాత్ర పేరిట యాత్రలకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణలో మెత్తం 33 జిల్లాలు, 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయేవిధంగా పెద్ద ఎత్తున యాత్రలు ర్వహించాలని బీజేపీ ప్రణాళిక రూపొందించింది. దీనికోసం 17 పార్లమెంట్ నియోజక వర్గాలను 5 క్లస్టర్ లుగా విభజించారు. ఈ 5 పార్లమెంట్ క్లస్టర్లకు భాగ్యనగరం, శాతవాహన, కోమరం భీం, కృష్ణమ్మ,కాకతీయ క్లస్టర్లుగా పేర్లు పెట్టారు.
భాగ్యనగరం క్లస్టర్ పరిదిలో భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజక వర్గాలు కవర్ అయేలాగా 600 కి.మీ మేర యాత్ర సాగనుంది. శాతవాహన క్లస్టర్ పరిదిలో కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల నియోజక వర్గాలు ఉంటాయి. 800 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది. ఇక కొమురం భీం క్లస్టర్ పరిదిలో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ నియోజకవర్గాలలో 1025 కి.మీ యాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా కృష్ణమ్మ క్లస్టర్ పరిదిలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ నియోజకవర్గాలలో 1190 కి.మీ యాత్ర కొనసాగనుంది. కాకతీయ క్లస్టర్ పరిదిలో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలు చేర్చారు. కాకతీయ క్లస్టర్ పరిదిలో 1100 కి.మీ యాత్ర చేయాలని రూట్ మ్యాప్ రూపొందించారు.
5పార్లమెంట్ క్లస్టర్లలోమార్చి1 వరకు సాగే ఈ యాత్రలను ప్రారంభించేందుకు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలను రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. అలాగే, మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో పాటు, రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు, తదితర అంశాలను ఈయాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కమలం నేతలు సిద్దం అవుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో ఈయాత్ర కొనసాగుతుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయని అంటున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంగా ఈ విజయ సంకల్ప యాత్రలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఐదు క్లస్టర్లలోని యాత్రలు హైదరాబాద్‌లో కలుస్తాయని పార్టీ నేతలు అంటున్నారు. మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీతో హైదరాబాద్ లో భారీ భహిరంగ సభకు కూడా కమలం నేతలు ప్లాన్ చేస్తున్నారు.