ఈ నెలాఖరున జరగనున్న గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కార్యాలయాన్ని ముట్టడించడానికి అభ్యర్థులు ప్రయత్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ జన సమితి పర్టీ కార్యాలయం నుంచి దాదాపు రెండు వేల మంది పరీక్ష అభ్యర్థులు ర్యాలీగా తరలి వచ్చారు. గ్రూప్-2 అభ్యర్థులకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మద్దతు పలికారు. ర్యాలీగా తరలి వస్తున్న అభ్యర్థులలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అభ్యర్థుల నిరసనల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఆగస్టు 1 నుంచి 23 వ తేదీ వరకు గురుకుల బోర్డుకు చెందిన పరీక్ష తేదీలు ఉన్నాయని.. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీలలో నర్వహించడం వల్ల.. అలాగే రెండింటికీ సిలబస్ వేరుగా ఉండటం వల్ల ఒక పరీక్షకి మాత్రమే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ కార్యాలయం వద్ద ఆందోళన అనంతరం బోర్డు కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.
హై కోర్టును ఆశ్రయించిన గ్రూప్ -2 అభ్యర్థులు
గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29, 30 తేదీలలో నిర్వహించబోయే పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని 150 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఇతర పరీక్షలు ఉన్నందున పరీక్షల తేదీలు మార్చాలని కమీషన్ ను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.