జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామని, ఒక వ్యక్తి రూ. 50వేల వరకు తీసుకెళ్లవచ్చని అంతకంటే ఎక్కువ నగదును తీసుకెళితే సరైన ఆధారాలు చూపించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షితా కే మూర్తి అన్నారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనల ఆధారంగా జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, వీటిపై ప్రత్యేక నిఘా ను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా సరిహద్దులలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, గత ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడిన వారిని చట్ట విరుద్ధమైన పనులను చేసేవారిని ముందస్తుగా బైండోవర్ చేశామని అన్నారు. అక్రమ మద్యం నిలువలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, మద్యం,నగదు ప్రలోభాలకు పాల్పడితే ప్రజలు సమాచారం ఇవ్వాలని అన్నారు. మద్యం, తాయిలాల పంపిణీపై ప్రజలు సీ_విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తగిన వ్యవధిలో వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.