తెలంగాణ బీజేపీ ఆపరేషన్ -2028 ఇప్పుడే స్టార్ట్ చేసిందా? పలు సామాజిక సమీకరణలతో ఎన్నికల యుద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చిందా? రాష్ట్రంలోని రెండు ప్రధాన సామాజికవర్గాల నేతలను పార్టీలో చేర్చుకొని మిషన్-2028ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుందా? ఆల్టర్నేట్ సర్కార్ తమదే అంటూ గత ఎన్నికల ముందు ఎంతో హడావుడి చేసిన బీజేపీ ఆశించిన సీట్లు సాధించలేక పోయింది. దానికి ఎవరి కారణాలు ఎలా ఉన్నా.. 2028లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం వదులుకోకూడదనే ఉద్దేశంతో ఇప్పటినుండే నుంచే పక్కా ప్లాన్ వేస్తోందంని అంటున్నారు.
తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి… 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా కలమం పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. పక్కాప్లాన్ ప్రకారం నాలుగున్నరేళ్ల ముందు నుండే పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక సమీకరణలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు… తెరచాటున మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన బీజేపీ.. 56 సీట్లలో తన ప్రభావాన్ని చూపింది. పార్లమెంట్ ఎన్నికల్లో బలం పుంజుకొని 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇదే స్పీడ్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలం పెంచుకొని, అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గం సీఎం నినాదంతో వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆర్.కృష్ణయ్యను బీజేపీ అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతుందని సమాచారం. ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు రాజీనామాలు చేశారు. మిగిలిన వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో ఆర్.కృష్ణయ్యను తెలంగాణ బీజేపీలో చేర్చుకునేలా పావులు కదుపుతున్నారట. బీసీ సంఘాల నేతగా కృష్ణయ్యకు తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యేగానూ ఆయన పనిచేశారు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకున్న తెలంగాణ బీజేపీ.. బీసీ వర్గాల ముఖ్య నేతలను ఆకర్షించడం ద్వారా… వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఓటర్లను పోలరైజ్ చేసేలా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆర్.కృష్ణయ్య అడుగులపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణపై బీజేపీ స్పష్టమైన విధానం తీసుకొని, ఎంఆర్‌పీఎస్ మద్దతు కూడా పొందింది. ఈనిర్ణయం వల్ల మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు జరిగిందని పార్టీలో విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న మంద కృష్ణ బీజేపీలోకి వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాల పోరాటానికి మద్దతు ఇచ్చిన బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే, రాజకీయ పార్టీలకు తాను దూరమని కృష్ణమాదిగ చెబుతున్నా, ఆయనను ఎలాగైనా ఒప్పించి.. పార్టీలో చేర్చుకోవాలని కమలనాథుల ఆలోచనగా తెలుస్తుంది.
మొత్తానికి, బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ఎంఆర్‌పీఎస్ నేత కృష్ణ మాదిగల ద్వారా బీజేపీ మిషన్ 2028 కంప్లీట్ చేయాలనే వ్యూహం ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలు. అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు బీజేపీతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కానదేది కమలనాథుల ఆలోచన. అనుకున్న విధంగా అంతా సవ్యంగా జరుగుతుందా? లేదా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.