తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకే విధమైన డైట్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి చౌరస్తాలోని TGMRJC మైనార్టీ పాఠశాల & జూనియర్ కళాశాల (గర్ల్స్) లో ఏర్పాటు చేసిన కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టోర్ రూం ను సందర్శించి, సన్నబియ్యం, నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్ చార్జీలు పెంచడం, 200 కష్మోటిక్ చార్జీలు పెంచిన డైట్ మెనూ ప్రారంభించడం జరిగిందని, విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు.తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మరియు వికారాబాద్ జిల్లాకు మంచి పేరు తేవాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ , జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.