ప్రేమ పేరుతో నమ్మించి యువతిని గర్భవతిని చేసిన నిందితునికి షాద్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్, పోక్సో కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.32 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో గల భీమారానికి చెందిన పూజారి పాండు ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, గర్భిణిని చేసి పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు 2017 మే 25న షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు డీఎన్‌ఏ రిపోర్టులతో 2018 జూన్ 22న పాండుపై చార్జిషీట్ దాఖలు చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి జీవిత శిక్ష విధించింది. అలాగే బాధితురాలికి రూ.10లక్షలు, ఆమెకు జన్మించిన కుమారుడికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని జిల్లా లీగల్ అథారికి కోర్టు సిఫారసు చేసింది.