ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చంద్ర మోహన్ కు బార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
చంద్రమోహన్ అసలుపేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా లోని పమిడిముక్కల గ్రామంలో 1945, మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో విద్యాభ్యాసం జరిగిగింది. చంద్ర మోహన్ బార్య పేరు జలంధర్, రచయిత్రిగా సుపరిచితురాలు. కూతురు మధుర మీనాక్షి అమెరికాలో సైకాలజిస్ట్ గా అక్కడే స్థిరపడ్డారు. మరో కూతురు మాధవి చెన్నైలో డాక్టర్ గా పనిచేస్తున్నారు.
చంద్రమోహన్ 1966 లో రంగుల రాట్నం సినిమాతో సినిమాల్లోకి వచ్చారు.ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలతో రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, సీతామహాలక్ష్మి, చందమామ రావే సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన ఇప్పటి వరకూ దాదాపు 932 సినిమాలలో నటించారు. ఒకానొక సమయంలో చంద్ర మోహన్ తో సినిమా అంటే హిట్ అనే పరిస్థితి ఉండేది. చంద్ర మోహన్ తో జయప్రదకు సిరిసిరి మువ్వ, శ్రీదేవికి పదహారెళ్ళ వయసు సినిమాలు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాయి. చంద్రమోహన్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల్లో నటించారు.