భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, ప్రజాకవి జయరాజ్, ప్రముఖ రచయిత జూపాక సుభద్ర లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వేచ్ఛ జేఏసీ సారథ్యంలో సైఫాబాద్ అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లోని సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం వీరందరూ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అమెరికా లాంటి దేశాలలో ప్రతి ముగ్గురిలో ఒకరు మతంపై నమ్మకం లేని వారున్నారని.. మన దేశంలో కూడా మతం పై నమ్మకంలేని వారి సంఖ్య నాలుగు శాతం పెరిగిందని సతీష్ చందర్ తెలిపారు. మనుస్మృతిలో శూద్రులను కించపరిచేలా రచనలు ఉన్నాయన్నారు. శూద్రులు, పంచములు, స్త్రీలపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. అలాంటి సాంప్రదాయాన్నిగౌతమ బుద్ధుడు ఎడమ కాలితో తొక్కొపడేశాడని.. అసమ, వర్ణ వ్యవస్థ మీద తిరుగు బాటు చేశాడని గుర్తు చేశారు. అంబేద్కర్ బుద్దుడి గురించి మాట్లాడుతూ ” స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ” అని ఫ్రెంచ్ విప్లవ సందేశాలని మనం ఇప్పుడు మాట్లాడుతున్నామని.. కానీ బౌద్ధ చక్రవర్తులు తమ భావనలతో ఈ వర్ణ వ్యవస్థ పైన శూలం దింపారన్న అంబేద్కర్ మాటలను సతీష్ చందర్ గుర్తు చేశారు.
గత 15 సంవత్సరాలుగా సతీష్ చందర్, కత్తి పద్మారావు లాంటి వారు తమ రచనల ద్వారా పోరాటం చేస్తూనే ఉన్నారని ప్రజాకవి జయరాజ్ అన్నారు. జైభీమ్ అన్నోడే నేడు దేవాలయాలపై పాటలు పాడుతున్నారని అన్నారు. దేశంలో బహుజన వర్గాలను అందర్నీ ఏకతాటి పైకి తెచ్చి, మా ఓటు మాకే అనే వాతావరణం వచ్చిందనుకున్న తరుణంలో వారు కూడా మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని అములు చేస్తున్నప్పుడే స్వేచ్ఛ జేఏసీ ఏర్పడిందని జయరాజ్ అన్నారు.
భారత రాజ్యాంగాన్నిముందుంచి మనువాదాన్నిపక్కకు నెట్టివేసినా కూడా ఇంకా ఇంకా మనువాద ధోరణులే అమలు అవుతున్నాయని ప్రముఖ దళితవాద రచయిత జూపాక సుభద్ర తెలిపారు. రాజ్యాంగం అమలులోనికి వచ్చి దాదాపు 75 సంవత్సరాల తరువాత కూడా దాని అమలు సరిగా జరగడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని GHMC పారిశుద్య కార్మికులలో ఒకరు కూడా అగ్ర కులానికి చెందిన మహిళలు ఎందుకు లేరని జూపాక సుభద్ర ప్రశ్నించారు. దళత మహిళలు నేటికీ అవమానాలకు గురవుతున్నారని.. గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు, జోగినీ వ్యవస్థ వంటి దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. వారికి అవమానాలే ఎదురవుతున్నాయని ఆమె ఆవెదన వ్యక్తం చేశారు.