యుజిసి(UGC) నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ యూనివర్సిటీలలో రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ చేస్తున్నట్టుగా, తెలంగాణలో కొత్తగా అనుమతులు ఇచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా రిజర్వేషన్లను అమలుపరిచిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు యూనివర్సిటీలు అయిన శ్రీనిధి, గురు నానక్, MNR, కావేరి, నిక్మార్ వంటి ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులు రిజర్వేషన్ల విధానాన్ని ప్రస్తావించకుండానే బిల్లులను ఆమోదించి గవర్నర్కు పంపించడం జరిగిందని అన్నారు.
దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు మరియు వెనుకబడిన తెగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, పెద్ద ఎత్తున వివాదం కొనసాగిన తర్వాత అప్పటి గవర్నర్ తిరస్కరించడం జరిగిందని తెలిపారు. కానీ, అదే బిల్లును నేటి ప్రభుత్వం మరల ఆమోదించి గవర్నర్ ప్రతిపాదనకు పంపించడం జరిగినదని.. దీని ద్వారా ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఉన్నత విద్యా అవకాశాలు దగకుండా మోసం చేస్తున్నదని అన్నారు. కావున కొత్తగా అనుమతులు ఇచ్చిన ఐదు యూనివర్సిటీలలో రిజర్వేషన్ల నిబంధనలు చేపట్టిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు.