మీడియా రంగంలో అగ్రగామిగా నిలిచిన దివంగత రామోజీ రావు ఉన్నత విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన అక్షర యోధుడని పలువురు సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నేతలు కొనియాడారు. వివిధ రంగాలతో పాటు మీడియా రంగంలో ఆయన చేసిన సేవలు మరువ లేనివని అన్నారు. రామోజీ రావు మరణం మీడియా రంగానికి జర్నలిజానికి తీరని లోటని పేర్కొంటూ ఆయనకు పలువురు పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు.
శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ (హెచ్ యూజే) ల ఆధ్వర్యంలో అక్షరయోధుడు, ఈనాడు మీడియా సంస్థల అధినేత దివంగత రామోజీ రావు సంతాప సభలో పలువురు సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీనియర్ పాత్రికేయుడు, హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, హెచ్ యూజే కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొని రామోజీ రావు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మీడియా రంగాన్ని విస్తరించి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన ఘనత రామోజీ రావుకే దక్కిందని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం, ఎంచుకున్న ప్రతీ రంగం విజయవంతమై చాలా మందికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తన మీడియా సంస్థల ద్వారా విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన రామోజీ రావు భవిష్యత్ తరాల పాత్రికేయులకూ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. మీడియా రంగంలో మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీ రావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు నెలకొల్పి ప్రతి సంవత్సరం ఉత్తమ జర్నలిస్టుకు అవార్డు ఇవ్వాలని జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.
ఈ సంతాప సభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాం చందర్, కార్యదర్శులు ఈ. చంద్ర శేఖర్, తన్నీరు శ్రీనివాస్, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు, నాయకులు రఘు, విజయానంద రావు, నాగ వాణి, యర్రమిల్లి రామారావు, అంజి రెడ్డి, గడ్డమీది అశోక్ తదితరులు పాల్గొని రామోజీ రావు చిత్ర పటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.