ప్రజలే నా ఎడిక్షన్ అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ వాకర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. తనకు ప్రజలతో లేకపోతే పిచ్చిలేచినట్లు ఉంటుందని.. ప్రజలంటే అంత ఎడిక్షన్ అని ఆయనకు ప్రజల పట్ల.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఎలా ఉందో తెలిపారు. తనను ఎక్కడికైనా టూర్ కి తీసుకుపోతే రెండు రోజులకు మించి ఉండలేనని.. వెంటనే తిరిగి వచ్చేస్తానని తెలిపారు. నో అనేది తన డిక్షనరీలోనే లేదన్నారు. ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందని అన్నారు.
నావి రెండే సిద్దాంతాలు
తనకు రెండే సిద్ధాంతాలు ఉన్నాయని.. ఒకటి అందరితో కలిసి మెలిసి ఉండటం.. రెండవది ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసి చూపించడం మాత్రమే అని తెలిపారు. ఓట్లు అయిపోయాయి ఇక కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని.. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఉన్న MLAల అందరికి ఫోన్ చేశానని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఓ కొత్త ఒరవడిని అమలుచేద్దాం అని చెప్పానని తెలిపారు.
నేను చాలా అదృష్టవంతుణ్ణి
తాను చాలా అదృష్టవంతున్నని ఈటెల అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ ధ్రువాలు లాగా ఉండే సిద్ధాంతాలు కలవారు కూడా తనకు ఓటు వేశారని అన్నారు. జెండాలను, పార్టీలను, సిద్ధాంతాలను, రాజకీయాలను పక్కనపెట్టి రాజేందర్ ను కాపాడుకోవాలని ఓటు వేశారని.. లేకపోతే ఇంత పెద్ద గెలుపు సాధ్యమయ్యేది కాదని ఆయన వివరించారు. రాజేందర్ అన్నా.. మీకు పదవి రాలేదా.. అని చాలామంది అడుగుతున్నారు. కానీ నాకు ఓటు వేసిన ప్రజల కోసం మొదటి 6 నెలల పాటు వారి హృదయాల్లో చోటు సంపాదించుకునే పని చేస్తానని మాట్లాడారు. మల్కాజ్గిరి ప్రజలందరికీ తాను ప్రత్యక్షంగా పరిచయం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. స్థానిక సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తానన్నారు.
మీరు రావడం కాదు.. నేనే మీ దగ్గరకు వస్తా
జీవోలు ఇచ్చేది, చట్టాలు చేసేది భగవంతుడు కాదు. చట్టాలు ప్రజల అవసరం కోసం మాత్రమే పనిచేయాలని కొట్లాడి అనేక రిఫార్మర్స్ తీసుకొచ్చిన వాడినని తెలిపారు. ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే అన్నట్టు.. మల్కాజ్గిరి ప్రజలకు నేనున్నా అని మాట ఇస్తున్నానని అన్నారు. మీరు నా దగ్గరికి రావడం కాదు.. నేనే మీ దగ్గరికి వస్తానని వారికి చెప్పారు. మా ఎంపీ ఈటల రాజేందర్ అని గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తానని అన్నారు. హైదరాబాదులో కోటి మంది జనాభాఉంటే సగం మంది మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే ఉన్నారని అన్నారు. తెలంగాణలోని 1/8 పాపులేషన్ మల్కాజ్గిరిలోనే ఉన్నారని తెలిపారు. 15 నియోజకవర్గాలకు సమానమైన ఓట్లు ఉన్న నియోజకవర్గంలో మల్కాజ్గిరి. ఇక్కడ తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.