ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు బీబీ పాటిల్, రఘునందన్ రావులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం 4:20 గంటలకు మోడీ జహీరాబాద్ కు చేరుకుంటారు. 4:30 గంటల నుంచి 5:20 వరకు పబ్లిక్ మీటింగ్ లో ఆయన ప్రసంగించనున్నారు. 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడినుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
లోక సభ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అమిత్ షా విడియోను డీప్ ఫేక్ లో ఎడిటింగ్ చేసి, కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని బీజేపీ పోలీస్ కంప్లైంట్ చేసింది. విచారణకు రావాలని ఢిల్లీ పోలీసుసులు కాంగ్రెస్ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. మరోవైపు బీజేపీని ప్రశ్నించినందుకే మోదీ, అమిత్‌షా తమకు నోటీసులు పంపించారంటూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. అంతేకాకుండా.. బీజేపీ బెదిరింపులకు భయపడే వారు లేరంటూ రేవంత్ కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటరిస్తారా ? సభలో మోడీ ఏం మాట్లాడబోతున్నారు ? జహీరాబాద్ సభపై బీజేపీ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.