ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పర్యటనలో తెలంగాణకు పలు వరాల జల్లులు కురిపించారు. 13,500 కోట్ల విలువైన పనులకు నిధులను ప్రకటించారు. రాష్ట్రానికి పసుపు బోర్డుతో సహా ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు. అనంతరం జరిగిన ప్రజాగర్జన సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు ప్రగతి నిరోధకంగా తయారయ్యాయని విమర్శించారు. అలాంటి వారు పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని దుయ్యబట్టారు. కుటుంబ పార్టీ పదవుల్లో వారి కుటుంబసభ్యులే ఉంటారు కానీ, ఇతరులకు అవకాశం ఉండదని ప్రధాని అన్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని మోడి అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో నిధుల దోపిడీ జరుగుతోందని విమర్శించారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ ఇచ్చే గ్యారంటీలకు మోడీ గ్యారంటీ ఉంటుందని తెలిపారు. తెలంగాణ రైతులకు కనీస మద్దతు ధర ద్వారా ధాన్యానికి 27 వేల కోట్లు అందించామని తెలిపారు. కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో తెలంగాణ రైతాంగానికి 10 వేల కోట్ల లబ్ది చేకూరుతుందని అన్నారు. తెలంగాణలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నూతనంగా నిర్మించినట్లు ప్రధాని మోడీ వివరంచారు.