Menu

  • Home
  • తెలంగాణ
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
TG CS Reviews on President, vice president visit to Hydedrabad

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి, 21వ తేదీన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సచివాలయంలో ఉన్నతాధికారులతో ఏర్పాట్ల సమీక్షించారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని, ఆయా డిపార్ట్‌మెంట్ల వారీగా నోడల్ ఆఫీసర్‌ను నియమించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.

cs review arrangements on President , vice president visit to Hyderabad

ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఆయన ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రాజ్ భవన్‌లో స్వల్ప విశ్రాంతి తీసుకుని, గవర్నర్ హై టీలో పాల్గొంటారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8:00 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు పేర్కొన్నారు. ఈ పర్యటనల దృష్ట్యా, పోలీస్ శాఖ బ్లూ బుక్, VVIP ప్రొటోకాల్ మాన్యువల్‌ ప్రకారం పటిష్టమైన భద్రతా, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వివిఐపిలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.

chief secretary review arrangements on vice President Hyderabad visit

ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. స్వల్ప విరామం కోసం రాజ్ భవన్‌లో బస చేసి, అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రాత్రి రాజ్ భవన్‌లో బస చేసి, మరుసటి రోజు, 22వ తేదీ ఉదయం పుట్టపర్తి పర్యటనకు బయలుదేరుతారని అధికారులు తెలిపారు. జి.ఎ.డి, ఫైర్ సర్వీస్, రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య, మున్సిపల్, ఇంధన, బి.ఎస్.ఎన్.ఎల్, హార్టి కల్చర్ వంటి అన్ని విభాగాలు తమకు నిర్దేశించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనకు ఏర్పాట్లు

ఈ రెండు కార్యక్రమాలలో అన్ని సంబంధిత డిపార్ట్‌మెంట్ అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కార్యక్రమ నిర్వహణకు సంబంధిత నిర్వాహకులు ఉప రాష్ట్రపతి కార్యాలయం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని, రాజ్ భవన్‌లో ఏర్పాట్లు, సన్నద్ధతపై తగిన చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్ జాయింట్ సెక్రటరీని కోరారు. మిలటరీ, ఎయిర్‌పోర్టు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముందు రోజున ASL మరియు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డిజిపిలు విజయ్ కుమార్, మహేష్ భగవత్, GHMC కమీషనర్ ఆర్.వి.కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

President Vice President visit to Hyderabad

Also Read…| జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ.

Share the post