Wednesday, June 18, 2025
HomeNewsTelanganaరెవెన్యూ స‌ద‌స్సులు.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

రెవెన్యూ స‌ద‌స్సులు.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

రాష్ట్రంలో రేప‌టినుండి రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హింస్తామని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేసిన విధానాన్ని సరిదిద్ది, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తున్నామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని మొదటి దశలో ఏప్రిల్ 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహించగా, ఆ తర్వాత మే 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో వీటిని నిర్వహించారు. తాజాగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. “ప్రజల వద్దకే రెవెన్యూ” అనే నినాదంతో అన్ని రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్‌తో కూడిన బృందం వెళ్లి, భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు

ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు వారి ప్రమేయం లేకుండానే భూ సమస్యల్లో చిక్కుకున్నారని, సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉండేదని, ఏ సమస్యకైనా కోర్టు మెట్లు ఎక్కవలసిందేనని మంత్రి అన్నారు. కానీ ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం వారి వద్దకే వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని ఆయన నొక్కి చెప్పారు. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు రాగా, రెండో విడతలో 28 మండలాల్లోని 421 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల్లో 42 వేల దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఇప్పటివరకు 60 శాతం వరకు భూ సమస్యలు పరిష్కరించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అధికంగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి త్వరలో పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read…| NDSA నివేదికను L&T తిరస్కరించడం వారికి చెంపపెట్టు: కేటీఆర్

ప్రభుత్వానికి, ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని, ఈ విభాగం సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరి, ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేయాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలు గ్రామ స్థాయిలో అందించడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుందన్నారు. ముఖ్యంగా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.

మానవతా దృక్పథంతో అధికారులు ప‌నిచేయాలి

ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ యంత్రాంగం మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలతో మమేకం కావాలని, వీలైనంతవరకూ వారి సమస్య పరిష్కారం చేసేలా వ్యవహరించాలని మంత్రి సూచించారు. భూభారతి చట్టంలో భాగంగా గ్రామ పరిపాలన అధికారులను (జి.పి.ఓ.) అతి త్వరలో నియామక పత్రాలను అందజేసి మండలాల్లో నియమించబోతున్నామని ఆయన ప్రకటించారు. గ్రామ పాలన అధికారుల 10,954 పోస్టుల భర్తీకి జి.ఓ. విడుదల చేయగా, 5 వేలకు పైగా దరఖాస్తులు అందాయని, ఇందులో మే 25 తేదీన నిర్వహించిన పరీక్షకు 4,588 మంది అభ్యర్థులు హాజరు కాగా, తుది మెరిట్ జాబితాలో 3,550 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఆయన వివరించారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం

అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాపు జతపరచాలని భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ఇందుకు అనుగుణంగా సర్వే సెటిల్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి దశలో ఆరు వేల మంది సర్వేయర్లను రెండు నెలల్లో నియమించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా నక్షా లేని 413 గ్రామాలలో పునఃసర్వే నిర్వహించబోతున్నామని, ఇప్పటికే 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

అదేవిధంగా టి.జి.ఆర్.ఎ.సి (TGRAC – తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్) ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులు) డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇందుకు సంబంధించి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యలన్నీ పారదర్శకతను పెంచి, ప్రజలకు మరింత సులభంగా భూ పరిపాలన సేవలను అందించడంలో దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments