తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎలక్షన్ కమీషన్ పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2,298 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 221 మంది మహిళలు కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల ఓటర్లు ఉన్నారు. తొలిసారి 9.9 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఓకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు 45 వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బందితో పాటు, 3వేల మంది ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారినీ, 50 కంపెనీల రాష్ట్ర ప్రత్యేక పోలీసులతో పాటు, మరో 375 కంపెనీల కేంద్ర బలగాలను భద్రత కోసం రంగంలోకి దింపారు. వీరితో పాటు 23 వేలకు పైగా ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఎన్నికలలో భద్రత కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత 13 నియోజకవర్గాల్లో భద్రతాకారణాలతో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది.