ప్రజా యుద్ద నౌక, గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం అమీర్ పేట లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం గుండె పోటుకు సంబందించి హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆమన పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఆసుపత్రి నుండి ఎల్బీ స్టేడియంకు తరలించారు. రేపు ఉదయం 11.30 నిమిషాల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం గద్దర్ అంత్య క్రియలు అల్వాల్ లోని భూదేవి నగర్ లో జరగనున్నాయి.
ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్.. పీపుల్స్ వార్, ఆ తరువాత మావోయిస్టు, తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలలో ఆయన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. గద్దర్ 1949లో ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. గద్ధర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో గద్ధర్ కీలకమైన పాత్రను పోషించారు. తన ఆట, పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1987లో ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన దళితుల హత్యలపైన గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం జరిపారు. నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం కూడా జరిగింది. పొడుస్తున్న పొద్దుమీద, అమ్మ తెలంగాణమా లాంటి పాటలతో ఉద్యమాలకు గద్ధర్ ఊపుతెచ్చారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే పాటకు నంది అవార్డు వరించినా.. గద్ధర్ ఆ అవార్డును తిరస్కరించారు. 1949లో శేషయ్య, లచ్చమ్మ దంపతులకు ఓ నిరుపేద దళిత కుటుంబంలో గద్ధర్ జన్మించాడు. గద్దర్ స్వగ్రామం ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.