పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను వారం లోగా పరిష్కరించాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాదు నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణిలో పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్, తహశీల్దార్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారు అని కమిషనర్ అడగగా.. కలెక్టర్ స్పందిస్తూ, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వారం లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ తహశీల్దర్లతో మాట్లాడుతూ.. ఇప్పటికే సంబంధిత తహసీల్దారుల లాగిన్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వారం లోగా పరిష్కరించేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందు కెళ్తారో తహసీల్దారులను అడిగి తెలుసు కున్నారు. డాటా కరెక్షన్స్, మ్యుటేషన్, సక్సేషన్ లాంటి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తహశీల్దర్లను ఆదేశించారు.
తహశీల్దార్ల కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రెవిన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో వారం లోగా ఆయా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రణాళిక ప్రకారంగా ముందు కెళ్లాలన్నారు. ప్రజా వాణికి వచ్చిన రెవిన్యూ ఫిర్యాదుల్లో 157 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రోజుల్లో ఆయా పెండింగ్ దరఖాస్తులను రోజు వారీగా ఎన్ని పరిష్కరించారో ప్రతి రోజు సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రామ చందర్, ఏవో వీర భద్రప్ప, ఆయా మండలాల తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.