Friday, April 18, 2025
HomeNewsTelanganaపెద్దవాగు ప్రాజెక్టుకు గండి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీష్ రావు

పెద్దవాగు ప్రాజెక్టుకు గండి.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీష్ రావు

అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకు పోయిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయి గేట్లు తెరిచి ఉంటే వంద కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదన్నారు. కట్టమీద నుంచి నాలుగైదు గంటల పాటు నీళ్లు పొంగిపొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. మూడు గేట్లుంటే, రెండు గేట్లే ఎత్తడంలో ఆంతర్యం ఏమిటన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై.. గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజన బిడ్డల ప్రాణాలు ఫణంగా పెట్టారని హరీశ్ రావు అన్నారు.

పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ భూ భాగంలోనే ఉన్నదని, పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులేనని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు గండి పడటం వల్ల గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బుచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతోపాటు, పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.

పెద్దవాగు ప్రాజెక్టు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని హరీశ్ రావు విమర్శించారు. రక్షించండని అధికారులకు ఫోన్ చేసినా కనీస స్పందన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హెలికాఫ్టర్లు సరైన కాలంలో రాకంటే ఆ రోజు వరదలో చిక్కుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు దారుణమన్న హరీశ్ రావు, ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అన్నారు. ముగ్గురు మంత్రులుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టింది ఏమిటని నిలదీశారు.

ఇసుకమేట వేసిన ప్రతి ఎకరాకు 25 వేల రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం కింద ఎకరాకు 10 వేల రూపాయలు నష్లపరిహారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చెయ్యాలని, పశువులు కోల్పోయిన రైతులకు ప్రకృతి వైపరిత్య నిధి నుండి ప్రభుత్వం వెంటనే సహాయం హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కారణాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments