Tuesday, April 22, 2025
HomeNewsTelanganaసీఎం పదవి కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు : NVSS ప్రభాకర్

సీఎం పదవి కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు : NVSS ప్రభాకర్

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినా పాలనపై పట్టు సాధించలేకపోయారని డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేవలం పరిపాలనలో పట్టు నిలుపుకోవడం కోసమే మూకుమ్మడిగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీలు చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనను గాడిలో పెట్టేందుకు కిందామీద పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ పెద్దల మెప్పు పొంది, తన సీఎం పదవిని కాపాడుకోవడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని.. ప్రజాపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ల నియామకాలు చేయలేకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమన్నారు. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల నియామకాలు, రాజకీయ ప్రచారం కోసం, పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకునేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే 11 సార్లు ఢిల్లీ వెళ్లారని, రాష్ట్రంలో పరిపాలనపై, ప్రజా సమస్యలపై మాత్రం ఎలాంటి శ్రద్ధ చూపలేదంటూ ఎన్.వి.ఎస్.ఎస్. మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే పాలన చేసుకోవాలంటూ చురకలు అంటించారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మూడు హత్యలు, ఆరు మానభంగాలుగా పాలనాతీరు మారిందని, రాష్ట్రం నేరాలతో విలయతాండవంగా మారిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయని ఎన్వీఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతతో కుంభకోణాల్లో పాత్రులైన అధికారులు పలాయనం చిత్తగించారన్నారు. రాష్ట్రంలోని వేలాది ఎంఎస్ఎంఈలకు కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించకుండా ఎంఎస్ఎంఈలకు సంబంధించి కొత్త విధానాలు ప్రవేశపెడుతామనడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కేసీఆర్ కనుసన్నల్లోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు జరుగుతున్నాయంటూ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుంభకోణాల నుంచి కాపాడుకునేందుకే ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వాన్ని నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీపై.. బిజెపి నిందలు మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ పదేపదే దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments