సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు అయ్యాయి. వెంటనే హుటాహుటిన గజ్వెల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
దుబ్బాక నియోజక వర్గంలో హత్యా యత్నానికి (తీవ్ర కత్తి పోటుకు) గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ , దుబ్బాక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు . ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య , ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు . ధైర్యంగా ఉండాలని సూచించారు . ఆందోళన చెందవద్దని ప్రభుత్వం , పార్టీ అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. హత్యా యత్నం సంఘటన దురదృష్ట కరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు . సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.