కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి పెళ్లైందని.. బంగ్లాదేశ్ వార్తాపత్రిక బ్లిట్జ్‌లో వార్త వచ్చిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విదేశీ జర్నలిస్ట్‌లు రాసిన వార్తలనే నమ్ముతారని, హిండెన్ బర్గ్‌ను నమ్మిన రాహుల్ గాంధీ.. బంగ్లాదేశ్ బ్లిట్జ్ పేపర్‌ను కూడా నమ్మాలని అన్నారు. ఆ ఫోటో లో ఉన్నది రాహుల్ గాంధీ సతీమణా కాదా..? అందులో వచ్చిన వార్తకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు.
బ్లిట్జ్ లో వచ్చిన వార్తపై విచారణ జరిపించమని రాహుల్ గాంధీకి అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. బ్లిట్జ్ రాసిన వార్తలపై సిట్ వేసి, విచారణ జరిపించే ధైర్యముందా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే ఢిల్లీకి వెళ్లి బ్లిడ్జ్ పేపర్‌ను రాహుల్ కు చూపిస్తానన్నారు.
రాహుల్ గాంధీ వంటి వారు సెబీని నమ్మరు.. అదానీపై నమ్మకం లేదు.. కాని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదానీతో కలిసి వ్యాపారాలు చేస్తారని.. విదేశాల్లో అదానీతో కలిసి తిరుగుతూ, వ్యాపార ఒప్పందాలు చేసుకొని, ఇక్కడ మాత్రం అదానీపై ఆరోపణలు గుప్పిస్తారని అన్నారు.
సెబీ అధ్యక్షురాలు మాధవి బుచ్ ఆమె భర్త ధవళ్ బుచ్ కు ఆదానీ కంపెనీలో షేర్లు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ.. గొడవలు సృష్టించాలని అనుకోవడమే రాహుల్ గాంధీ ఉద్దేశమని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తమ్ముడు దందా చేయవచ్చు.. కానీ, సెబి చైర్మన్ షేర్లు కొనుకోవద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు హిండెన్ బర్గ్‌ను నమ్మితే… తాను బ్లిడ్జ్‌ను విశ్వసిస్తానన్నారు. బ్లిట్జ్ లో వచ్చిన వార్తలో రాహుల్‌తో పాటు ఉన్న అమ్మాయి ఎవరో చెప్పాలన్నారు. ఆమెను రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నారా? లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? తేలాలన్నారు.
జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ వ్యాఖ్యలకు రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాకపోతే గతంలోడ్రోన్ కెమెరా ఎగరవేసినందుకు రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసలు పెట్టారని ప్రశ్నించారు.