కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తమ పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహారశైలి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా, మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సమావేశంలో సీఎం రేవంత్, సీనియర్ నేత జానా రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లన్న, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. కాజీపేటలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ‘బీసీల సమర శంఖారావం’ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కౌంటింగ్ రోజున, విదేశీ పర్యటనలో ఉన్న ఓ మంత్రి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి, మల్లన్న ఓడిపోయే అవకాశమేమిటి అని అడిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తానని.. వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.
బీసీల అండదండలతోనే తాను ఎమ్మెల్సీగా గెలిచానని, తన ఓటమికి స్కెచ్ వేసిన వారిని వచ్చే ఎన్నికల్లో ఒక్కరినీ కూడా గెలవనివ్వబోనని స్పష్టం చేశారు. ఇలా మాట్లాడటం వల్ల తన పదవి పోతుందన్నా, తగ్గబోనని.. మళ్లీ టీవీ ముందు కూర్చుంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ సర్కారు రాబోతోందని చెబుతూ.. రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని హెచ్చరించారు. బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.9 వేల కోట్లే కేటాయించడంపై, తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు మల్లన్న తెలిపారు