తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా పీసీసీ అధ్యక్షపదవి రేసులో పలువురి పేర్లు వినిపించాయి. అయినా అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ నే ఎంపిక చేసింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవి జూలై 7వ తేదీనే ముగిసినా.. రెండు నెలల అనంతరం కొత్త పీసీసీ నియామకం జరిగింది.
అధిష్టానానికి ధన్యవాదాలు..
తనపై అత్యంత నమ్మకంతో కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవీబాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీ లకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యే లకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని తెలిపారు.