కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల్లో కలిపి పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు. వాటిని భర్తీ చేయకుండా గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అని కోరుట్ల బీజేపీ అభ్యర్థిని ప్రశ్నించాలని అన్నారు. శనివారం మెట్ పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్క రైల్వే శాఖలోనే 3.5 లక్షలు, రక్షణ శాఖలో 3.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కానీ కేంద్రం భర్తీ చేయడం లేదని, కానీ బీజేపీ వాళ్లు ఇక్కడికి వచ్చి యువతను రెచ్బగొడుతున్నారని కవిత ద్వజమెత్తారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని బీజేపీ నాయకులను, ముఖ్యంగా కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు. “గత పదేళ్లలో కేంద్రంలోని ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని, ఏం చేస్తున్నావు… గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నావా అని మీ దగ్గరికి బీజేపీ అభ్యర్థి వస్తే బాజాప్తా నిలదీయండి ” అని అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందనుకుంటున్నారని, కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరిని మోసం చేయలేరని, కొన్ని సార్లే కొందరిని మోసం చేయగలరని సూచించారు.
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయలేదని, చిన్న రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీకి ఉద్యోగాలు ఇవ్వచేతకాదని, ఇచ్చినోళ్లను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇంకా ఇచ్చుకుంటామని, కానీ వాట్సప్ లో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేనతంగా తెలంగాణలో 2.3 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేశామని, 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల నియామకాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు ఢిల్లీ, ముంబాయ్, చెన్నై వంటి నగరాలను కాదని హైదరాబాద్ కు వస్తున్నాయని, గత పదేళ్లలో హైదరాబాద్ కు 22 వేల కంపెనీలు వచ్చాయని తెలియజేశారు. దాంతో దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. బీజేపీ చెబుతున్న విషయాల్లో ఎంత వరకు నిజముందో చూసుకోవాలని కోరారు. కష్టమున్నా నష్టమున్నా ప్రజలతోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, ఉంటూనే ఉంటుందని పేర్కొన్నారు. చెరువు ఎండితే కప్పలు వెళ్లిపోతాయని, చేపలు మాత్రం అక్కడే ఉంటాయని, కాబట్టి బీఆర్ఎస్ వాళ్లం చేపల్లాంటి వాళ్లమని వివరించారు.
బీసీలు, మహిళలకు అన్యాయం చేస్తున్న బీజేపీ : తుల ఉమ
బీజెపీ చెప్పే మాటలకు చేతలకు సంబంధం ఉండదని, బీజేపీ మోసం చేసే పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా ధ్వజమెత్తారు. బీజేపీ చెబుతున్న సిద్ధాంతాలకు చేస్తున్న పనులకు కూడా సంబంధం లేదని విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గంలో మెట్ పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ కు మద్ధతుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ప్రచార కార్యక్రమంలో తుల ఉమా పాల్గొని మాట్లాడారు. బీజేపీ బీసీలు, మహిళలు అని అంటూ ఉంటుందని, కానీ బీసీలకు, మహిళలకు బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఆమోదించామని చెప్పుకుంటున్న బీజేపీ మహిళలకు కనీసం 10-15 శాతమైనా మహిళలకు టికెట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీసీ ముఖ్యమంత్రి అని అంటున్న బీజేపీ బీసీలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళ అయిన తాను బీసీ కాదా అని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి దొంగచాటున మళ్లీ గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ చెప్పే మాటలకు చేతలకు సంబంధం లేదని, బీజేపీ మోసం చేసే పార్టీ అని ధ్వజమెత్తారు. బీజేపీ చెబుతున్న సిద్ధాంతాలకు చేస్తున్న పనులకు కూడా సంబంధం లేదని విమర్శించారు. కాగా, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్న క్రమంలో చాలా వరకు సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు. 55 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అందరూ మద్ధతిచ్చి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.