ఈ యేడాది ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సంవత్సరం “తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాలు” పేరుతో బోనాల జాతరను నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. బోనాల జాతర నిర్వహణకు గాను అడగగానే రూ. 20 కోట్ల రూపాయలను విడుదల చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు.
జిహెచ్ఎంసి పరిధిలో ఆషాఢ బోనాల ఉత్సవాలను నిర్వహించే అమ్మవారి దేవాలయాల కమిటీలకు బోనాల నిర్వహణా ఖర్చుల నిమిత్తం ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు ఆలయ కమిటీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ ను, తేదీల వారీగా ఆయా దేవాలయాల్లో నిర్వహించే బోనాల జాతర వివరాలను తెలిపే బోనాల జాతర క్యాలెండర్ ను, వీడియో సాంగ్ ను, బోనాల చరిత్ర, సంస్కృతి, పరిణామక్రమం, క్రతువులను తెలుపుతూ సాంస్కృత శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ బోనాల పై రాసిన ‘బోనాలు’ పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ బోనాల జాతరలో పాల్గొంటారని మంత్రి సురేఖ ప్రకటించారు. మంత్రులు ఆయా దేవాలయాల్లో బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుని భద్రంగా ఇండ్లకు చేరేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సాగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఆయా దేవాలయాల పరిధిలో అమ్మవార్ల మహిమలు, దేవాలయ ప్రాశస్యాన్ని తెలిపేలా ఎల్ఈడి తెరల పై ప్రదర్శనలు, ప్రజలకు కనులవిందు కలిగించేలా లేజర్ షో లు వుంటాయని మంత్రి తెలిపారు. గత సంవత్సరం బోనాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఈ యేడు కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
భక్తులు లక్షలాదిగా హాజరయ్యే ఆషాఢ బోనాల ఉత్సవాలను విజయవంతంగా చేపట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి అన్నారు. దేవాలయాల ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలు ఈ దిశగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీలు ప్రజలను కలుపుకుపోవాలని, బాగా కష్టపడి బోనాల ఉత్సవాలను జయప్రదం చేయాలని సూచించారు. దేవాలయాలకు సమీపంలోని ప్రైవేట్ హాస్పటల్స్, ఫైర్ స్టేషన్ లతో నిరంతరం కాంటాక్ట్ లో ఉంటూ సహాయ, సహకారాలు పొంది విధంగా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు. బోనాలకు ఎంతమంది హాజరైనా ఇబ్బందులు కలగకుండా మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సాగుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేస్తున్న బోనాల ఉత్సవాలను దిగ్విజవంతంగా చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాలు పుస్తక రచయిత, సాంస్కృతిక శాఖ డైరక్టర్ డా. మామిడి హరికృష్ణ, బోనాల జాతర వీడియో సాంగ్ రూపకల్పనలో పాలుపంచుకున్న బృందాన్ని మంత్రులు, అధికారులు శాలువాలతో సత్కరించారు.