కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగ్రాలో రెండు రోజుల పాటు జరిగే మేధోమధనం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క హాజరవనున్నారు. ఈనెల 9, 10వ తేదీల్లో జరిగే ఈ సమావేశంలో పాల్గొనడానికి ఆదివారం సాయంత్రం మంత్రి ఆగ్రాకు బయలుదేరి వెళతారు. అక్కడ రెండు రోజుల పాటు ఉండి చింతన్ శివిర్‌లో పాల్గొంటారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న చట్టాలు, సంక్షేమ పథకాలు పై చింతన్ శివిర్‌లో సమీక్షతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం పెంచే అంశంపై చర్చలు జరగనున్నాయి. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ ఆహ్వానం మేరకు సీతక్క చింతన్ శివిర్‌కు హాజరవుతున్నారు. అన్ని రాష్ట్రాలు పాల్గొనే మేధో మధనం ద్వారా, ఆయా రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా అణగారిన వర్గాలకు సంబంధించిన చట్టాలు, సంక్షేమాలను మరింత పకడ్బందిగా అమలు చేసే దిశగా కార్యాచరణను రూపొందించనున్నారు.