జులై 7 వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు దేవాలయాల వారీగా సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. జులై 21, 22 వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 5వ తేదీ లోపే నగరంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 21వ తేదిన బోనాలు ,అమ్మవారి దర్శనం కార్యక్రమాలు ఉండగా, 22 వ తేది ఉదయం 9 గంటలకు రంగం మరియు గజాదిరోహణ మహోత్సవం అంబారిపై అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం జరగనుంది.
ఈసారి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా భక్తలు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. 1830 నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అమ్మవారి ఆశీర్వాదంతో బోనాలు విజయవంతం అయ్యేలా ప్రజల సహకారం ఉండాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. మహంకాళి బోనాలు అంటేనే హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట ఉంటుందని, ఈసారి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో 20 కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. ఆలయ పరిసరాల్లో లైటింగ్, ఆ మూడు రోజుల పాటు నిరంతర నీటి సరఫరా, నిరంతర విద్యుత్ ఏర్పాటుతో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్ ల ఏర్పాటు, పోలీసుల సమక్షంలో భారికేడ్లు చేపట్టాలని తెలిపారు. తాగునీటికి వాటర్ పాకెట్స్, వాటర్ బాటిల్స్ , 4 హెల్త్ క్యాంప్ లు, శిక్షణ పొందిన పిసిఆర్ బృందాలు, ప్రత్యేక అంబులెన్స్, ఫైర్ ఇంజన్స్, స్వాగత బోర్డుల ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు , ఎమర్జెన్సీ గేట్లు , ప్రత్యేక క్రైం టీమ్స్ , మల్టి లెవెల్ పార్కింగ్ సదుపాయాలు , ఏనుగు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనీ ఊరేగింపు సమయంలో రోప్ పార్టీ ఏర్పాటు , క్రైం టీమ్స్ , షి టీమ్స్ ఏర్పాటు, 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, బోనాల రోజు ముఖ్యమంత్రి , గవర్నర్, ప్రోటోకాల్ వెహికిల్స్ తప్ప తమ వాహనాలు కూడా దేవాలయానికి దూరంగా ఆపి అమ్మవారి దర్శనానికి వచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఏర్పాట్ల విషయంలో ఎవరైనా నిరక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ సమస్య ఉన్నా స్థానికులు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా జరగాలంటే స్థానికుల సహకారం ఉండాలన్నారు.
సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,సెక్రటరీ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోటా నీలిమ, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ , దేవాలయ కమిటీ , ఇతర స్థానిక ముఖ్యనేతలు.. పోలీస్ , జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి,వాటర్ వర్క్స్ ,విద్యుత్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.