రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రస్తుతం చేపట్టే పనులు మరో 100 ఏళ్ళ వరకు చెక్కుచెదరకుండా వుండే విధంగా నిర్మాణపనులు చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవాలయ నిర్వహణ విషయంలో ఆగమ శాస్త్రాలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, అంతే ప్రాధాన్యతను భక్తుల సౌకర్యాల కల్పనకు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సురేఖతో కలిసి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పలు దశలుగా చేపట్టే దేవాలయ అభివృద్ది పనులు కొనసాగింపుగా వుండేలా తప్ప మరో దశలో చేపట్టే పనులతో విభేదించకుండా సమర్థవంతంగా కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సురేఖ తెలిపారు. పవర్ పాయింట్ ప్రజేషన్ ద్వారా అధికారులు మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ లకు వేములవాడ దేవాలయ పురోగతి పనులను వివరించారు. వేములవాడ ఆలయ గోశాలలోని ఆవులు, కోడెల ఉచిత పంపిణీ విధివిధానాలను అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతమున్న ధర్మగుండాన్ని కేవలం స్వామివారి అభిషేకానికే కేటాయించి, భక్తుల సౌకర్యార్థం మరో ధర్మగుండాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. వేములవాడ దేవాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా షాపుల నిర్వహణ విషయంలో యజమానులకు కచ్చితమైన మార్గదర్శకాలను సూచించాలని అధికారులను ఆదేశించారు. గంగా జమున తెహజీబ్ ను ప్రతిబింబించే వేములవాడ దేవాలయంలోని దర్గా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటి నిధులతో బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధిని చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేవాలయ విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న శివరచన వేదికలో శివరాత్రి ఉత్సవాలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలపగా, కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి పవిత్ర మాసాల్లో, ప్రత్యేక దినాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్ధారించుకున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
బాసర దేవాలయంలో ప్రస్తుతం 2 రాజగోపురాలు మాత్రమే వుండగా, వీటిని నాలుగు పెంచాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. ప్రాకారం, గోపురాలు, గర్భగుడి పనులను మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. బాసరలో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో వున్న సత్రాలు, వాటి పరిధిలోని గదుల పై మంత్రి సురేఖ ఆరాతీశారు. భక్తుల సౌకర్యం నిమిత్తం పార్కింగ్, మూత్రశాలలు, క్యూలైన్లు తదితర అంశాలకు సంబంధించి ఏమాత్రం ఏమరపాటు తగదని మంత్రి హెచ్చరించారు. నిర్మాణ పనులు చేసేటప్పుడు భక్తులకు ముందుగానే సమాచార సాధనాల ద్వారా సమాచారమిచ్చి అసౌకర్యాన్ని నివారించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు.
భద్రాచలం ఆలయ విస్తరణకు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో భూసేకరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి చేపడుతున్న భూసేకరణ, ఆలయ విస్తరణ పనుల పై అధికారులు మంత్రి పొంగులేటికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. శాస్త్ర నియమాలను తప్పకుండా, సహజంగా దేవాలయ విస్తరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. కళ్యాణ మండపానికి అనుబంధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో మండపాన్ని నిర్మించాలన్నారు. దేవాలయ విస్తరణలో భాగంగా కుసుమ హరనాథ దేవాలయానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి దేవాలయాన్ని సందర్శించి, పరిసరాలను కలియతిరిగి కచ్చితమైన నిర్ణయానికి వస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రానున్నదసరా పండుగను పురస్కరించుకుని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో నిర్వహించే ‘దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు’ పోస్టర్ ను మంత్రులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు ఆవిష్కరించారు.