రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రైతులకు లాభదాయకమైన నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు బ్యూరోక్రట్లపై కూడా దాడులు చేసి చంపించేందుకు సైతం తెగబడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదని ఆయన విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు.. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించి హుందగా మసలుకోవాలని ఆయన హితబోధ చేశారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగళవారం జాతీయ రహదారుల పురోగతిపై సమీక్షించిన మంత్రిపై వ్యాఖ్యలు చేశారు. మాది ప్రోగ్రసివ్, ప్రోయాక్టివ్ ప్రభుత్వమని చెప్పిన పదేండ్లుగా నత్తన నడకన సాగుతున్న జాతీయ రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నాట్లు తెలిపారు. కేసిఆర్ వ్యక్తిగత రాజకీయ కక్ష కోసం రాష్ట్రాన్ని బలిపశువును చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే భూసేకరణ చేసి ఉంటే.. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు భూసేకరణకు వెచ్చించాల్సిన అవసరం వచ్చేదికాదని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాగద్వేషాలు లేకుండా పనిచేస్తానని చెప్పి రాజ్యాంగాన్ని కేసిఆర్ కూనీ చేశారని ఆయన ఆగ్రహంవ్యక్తం చేశారు.
ఆర్ & బీ శాఖ పరిధిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చేపట్టి వివిధ జాతీయ రహదారులపై సమీక్షించిన మంత్రి పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. ఎక్కడా అలసత్వానికి తావులేకుండా ప్రతీ పనిని చెప్పిన సమయానికి పూర్తి చేసినప్పుడే పనులు పూర్తవుతాయని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. జాతీయ రహదారుల అలైన్ మెంట్ రూపొందించేటప్పుడు.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అటవీ భూములు లేకుండా అలైన్ మెంట్లను రూపొందించాలని సూచించారు.. అప్పుడే పనులు వేగంగా ముందుకు సాగుతాయని అధికారులకు తెలిపారు. ఎన్.హెచ్. ప్రాజెక్టు డైరెక్టర్లు భూసేకరణను వేగవంతం చేసేందుకు జిల్లాలోని కలెక్టర్, ఆర్డీఓలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తేనే భూసేకరణ విజయవంతం అవుతుందని ఆయన అధికారులకు చురకలంటించారు. వచ్చే వారం నుంచి పనులు జరుగుతున్న రోడ్లను పరిశీలిస్తానని.. నిర్మాణ నాణ్యత, స్థితిగతులను స్వయంగా చూస్తానని తెలిపారు.
మంచిర్యాల నుంచి ఖమ్మం జిల్లా వరకు వ్యాపించిన ఎన్.హెచ్-163 జీ నాగ్ పూర్-విజయవాడ కారిడార్ లో భాగంగా భూసేకరణ కోసం డ్రాఫ్ట్ అవార్డ్స్ 1023 కేసులు జాతీయ రహదారుల సంస్ధ వద్ద పెండింగ్ లో ఉండటంపై మంత్రి ప్రశ్నించారు. అయితే, వీటన్నింటిని వచ్చే 15 రోజుల్లో పూర్తి చేస్తామని ఎన్.హెచ్ అధికారులు తెలుపగా.. డ్రాఫ్ట్ అవార్డులను పాస్ చేసి అవార్డ్ అమౌంట్ ను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని మంత్రి ఆదేశించారు. అంతేకాదు, భూసేకరణ చేశాక డబ్బులు చెల్లిస్తామన్న ఆర్.ఓ. శివశంకర్ వ్యాఖ్యాలపై మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకుండా రైతులు భూములెందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ముందుగా రైతులకు పరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి కలెక్టర్ అర్బిట్రేషన్ అవార్డ్స్ కు అప్రూవల్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అయితే, ఈ అర్బిట్రేషన్ అంశం తన వద్దకు రాలేదని రాగానే పరిష్కరిస్తానని ఆర్.ఓ. శివశంకర్ తెలుపగా.. స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన జోక్యం చేసుకొని అర్బిట్రేషన్ అవార్డ్స్ అంశం ఇప్పటికే కలెక్టర్ పంపించారని కానీ అప్రూవల్ రాలేదని తెలిపారు. కలుగజేసుకున్న మంత్రి వెంటనే ఈ అంశాన్ని పరిష్కరించి పనులను ప్రారంభించాలని తెలిపారు. గ్రౌండ్ లెవల్ లో పీడీల పనితీరు ఒకింత నిరాశాజనకంగా ఉందన్న మంత్రి.. అందరిని అలెర్ట్ చేయాలని ఆర్.ఓ.ను చెప్పారు. రైతులు యాసంగి పంటలు వేసుకుంటే.. భూసేకరణ కష్టమవుతుందని.. అప్పుడు మనం అవార్డులు పాస్ చేసినా ఫలితం ఉండదని.. కాబట్టి వెంటనే భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవ్వాల భూసేకరణ ఛాలెంజ్ గా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన గత పాలకులు.. కనీసం రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ప్రాజెక్టులకు భూసేకరణ కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు భూసేకరణ చేద్దామంటే భూములు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. అంత స్థాయిలో పరిహారం చెల్లించడం కత్తిమీద సాముగా మారిందని ఆయన అన్నారు.
అయితే, సింగరేణి మరియు ఎన్టీపీసీ భూసేకరణ కోసం ఎకరాకు 30 లక్షల రూపాయాలు ఇస్తున్నారని, ఇదే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ బీహార్ రాష్ట్రంలో ఎకరాకు 20 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుందని.. తెలంగాణలో మాత్రం కేవలం ఆరు లక్షలు ఇచ్చి భూములు ఇవ్వమంటే ఎవరు ఇస్తారని మంత్రి ఎన్.హెచ్ అధికారులను ప్రశ్నించారు. మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి రాష్ట్రంలో భూముల విలువల ఆధారంగా.. చెల్లించాల్సిన నష్టపరిహారంపై ఒక రిక్వెస్ట్ లెటర్ ను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ అందజేస్తానని ఆయన చెప్పారు. ఇది ప్రజాప్రభుత్వమని.. మానవతా ధృక్పధంతో రైతులకు మెరుగైన భూపరిహారం అందేలా చూడటం మన అందరి బాధ్యత అని మంత్రి అన్నారు.
హైదరాబాద్ – మన్నెగూడ
ఎన్.హెచ్-163 హైదరాబాద్ – మన్నెగూడ సెక్షన్ పనుల అగ్రిమెంట్ జరిగి మూడేండ్లు అవుతుంది.. కానీ పనుల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్నచందంగా మారిందని అధికారులను మంత్రి నిలదీశారు. ఎప్పుడు రివ్యూ చేసిన బన్యన్ ట్రీస్ రిలోకేషన్, ఎన్జీటీ కేసు గురించి తప్పా కొత్తగా ఏం చేశారని ప్రశ్నించారు. అక్కడ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పొగుట్టుకుంటుంటే ఇదేం పద్ధతని మంత్రి ఆగ్రహంవ్యక్తం చేశారు. 92% భూసేకరణ పూర్తయ్యింది, 46 కిలోమీటర్ల రహదారిలో 4-5 కిలోమీటర్లు సమస్య ఉంటే మొత్తం రోడ్డు నిర్మాణం పెండింగ్ లో పెడితే ఎట్లా అని ఆయన ప్రశ్నించారు. పనులు ప్రారంభించాలనే నేనే పదిసార్లు ఆదేశించానని అయినా సాకులు వెతుక్కుంటూ పనులను సాగదీయడం ఏంటని నిలదీశారు. వెంటనే నిర్మాణానికి ఇబ్బందులు లేని ప్రాంతంలో రోడ్డు పనులను ప్రారంభించాలని తేల్చిచెప్పారు. కాంట్రాక్టర్ కన్నా ప్రభుత్వం, ప్రజలు గొప్పవారని ఇందులో ఎలాంటి భేషజాలకు తావులేదని పనిచేయని సంస్థకు నోటీసులు పంపండని తేల్చిచెప్పారు. వచ్చే వారం పనులు ప్రారంభించాలని.. లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటదని మంత్రి హెచ్చరించారు.
జనవరి కల్లా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి టెండర్లు :
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, చౌటుప్పల్) (158.64 కి.మీ) సాధ్యమైనంత త్వరగా డీపీఆర్ పూర్తి చేసి డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో టెండర్లు పిలిచేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన జాతీయ రహదారి సంఖ్య కోసం పంపిన రిక్వెస్ట్ మోర్త్ లో పెండింగ్ లో ఉందని ఎన్.హెచ్.ఏ.ఐ. ఆర్.ఓ. శివశంకర్ తెలిపారు. అలాగే స్టేజీ-1 ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక వారం రోజుల్లో వస్తుందని, ట్రైపార్టేట్ ఫైనాన్షియల్ పార్టిసిపేట్ అగ్రిమెంట్ మోర్తలో పెండింగ్ లో ఉన్నాయని తెలుపగా.. సంబంధిత కేంద్ర అధికారులతో మాట్లాడి అప్రూవల్స్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.. మీ పనులను మీరుకూడా అంతే బాధ్యతతో చేయాలని మంత్రి అన్నారు. కేంద్రం ఇప్పటికి దక్షిణ భాగానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వనందునే.. దక్షిణ రీజినల్ రింగ్ రోడ్డు భాగం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఎన్.హెచ్ అధికారులకు తెలిపారు.
హైదరాబాద్ – శ్రీశైలం (ఎన్.హెచ్-765):
హైదరాబాద్ – శ్రీశైలంలో రహదారిలో భాగంగా తుక్కుగూడ నుంచి డిండి వరకు నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణంలో ఎన్.హెచ్.ఏ.ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలైన్ మెంట్ అప్రూవల్ గురించి అడిగింది. ఇప్పటికే తాము మూడు మార్గాలను పరిశీలించామని.. అందులో ఇప్పటికే ఉన్న రహదారిని విస్తరించాలంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు అడ్డుగా ఉన్నాయని.. దీంతో అది ఆచరణసాధ్యం కాదని విరమించుకున్నామని. ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్ మెంట్ అప్షన్ సిద్ధం చేశామని.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే కేంద్రానికి పంపిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే శ్రీశైలం త్వరగా చేరుకోవచ్చని.. తప్పకుండా సీఎంగారితో కలిసి మాట్లాడి అలైన్ మెంట్ ను పరిశీలించి.. చర్చించి ఆమోదం తెలుపుతామని తెలిపారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (ఎన్.హెచ్-765):
రాష్ట్రానికి అత్యంత ఉపయుక్తమైన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి కేవలం రెండు – మూడు గంటల్లో చేరుకోవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందుకోసం అనేకసార్లు ప్రధాని నరేంద్రమోదీని మరియు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసామని, అది జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలను కలిపే రహదారిని.. తప్పకుండా గడ్కరీ చెప్పినట్టు మంత్రి తెలిపారు. దీని కోసం 7000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు అంచనాలు ఉన్నాయని.. ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉన్న ఈ రహదారి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు డే అండ్ నైట్ పని చేయాలని అధికారులకు సూచించారు.
గౌరెల్లి – వలిగొండ (ఎన్.హెచ్-930పీ) పూర్తయితే మూడు గంటల్లో భద్రచలానికి :
భద్రాచలానికి 7 గంటలు పట్టే ప్రయాణ సమయం గౌరెల్లి-వలిగొండ రోడ్డు పూర్తయితే కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇది పూర్తయితే.. 150 కీలోమీటర్ల దూరం తగ్గుతుందని, ఈ రోడ్డు మంజూరీ కోసం రెండు సంవత్సరాలు ప్రయత్నించి సాధించానని చెప్పిన మంత్రి.. అయినప్పటికి పనులు ఇంకా టెండర్ దశలోనే ఉండటం ఏంటని అధికారులను మంత్రి నిలదీశారు. కట్టె విరగదు – పాము చావదు అన్నచందంగా మన పనులు ఉన్నాయని.. ఎప్పుడు అడిగినా డీపీఆర్, కన్సల్టెంట్, ఫారెస్ట్, భూసేకరణ, పరిహారం, టెండర్ల దగ్గరే ఆగిపోతున్నాయని ఇంకా ఎప్పుడు పనులు పూర్తి చేస్తామని మంత్రి అధికారులను ప్రశ్నించారు. గతం గతః ఇప్పటికైనా వేగంగా పనులు చేయాలని అధికారులకు చెప్పారు.
ఇక ఖమ్మం దేవరాపల్లి (ఎన్.హెచ్-365 బీజీ) రోడ్డు ప్రధాన రహదారితో పాటుగా సర్వీసు రోడ్లను కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు. అయితే, ప్రధాన రహదారి పనులు పూర్తయిన తర్వాతనే సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ రీజినల్ ఆఫీసర్ శివశంకర్ ను మంత్రి ఆదేశించారు. నాగపూర్-హైదరాబాద్ సెక్షన్-ఎన్.హెచ్44 లో భాగంగా గుండ్లపోచంపల్లి టూ బోయినపల్లి రోడ్డు పనులను వేగవంతం చేయాలని సూచించారు. క్వాలిటీ, ప్రొగ్రస్ చూసేది మీరు కాబట్టి జాగ్రత్తగా పర్యవేక్షించాలని దిశానిర్ధశం చేశారు. వీటితో పాటు కామారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్.హెచ్-44 గుండ్లపోచంపల్లి-బోయినపల్లి. కలకల్లు – గుండ్లపోచంపల్లి ఎన్.హెచ్-44, ఖమ్మం జిల్లాలోని ఎన్.హెచ్-365 బీజీ ఖమ్మం-దేవరపల్లి ప్రాజెక్టులోని మూడు ప్యాకేజీలను, అలాగే, వరంగల్ ఖమ్మం: ఎన్.హెచ్-163జీ ప్యాకేజీ 1 మరియు రెండు. వరంగల్ జిల్లాలోని కరీంనగర్-వరంగల్ ఎన్.హెచ్-563. మహబూబ్ నగర్ జిల్లాలోని నందికన్నె – జూలెకల్ వరకు మరియు జూలెకల్ నుంచి దిన్నెదేవరపాడు వరకు. హైదరాబాద్ – బెంగళూర్ ఎన్.హెచ్-44 సెక్షన్ లోని తౌండుపల్లి-కొత్తూరు రహదారుల నిర్మాణ స్థితిగతులపై మంత్రి సమీక్షించారు.
ఇక రాష్ట్ర జాతీయ రహదారులైన.. ఖమ్మం-కురవి ఎన్.హెచ్-365ఏ భూసేకరణ విషయంపై జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెహ్రూ నగర్ టూ కొత్తగూడెం ఎన్.హెచ్930పీ కి సంబంధించిన భూసేకరణ పూర్తయ్యింది, డీపీఆర్ ను ఆమోదించిన మీదట వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మద్నూర్-బోధన్ ఎన్.హెచ్-161బీబీ రెండు లైన్ల నుంచి 4 లైన్లుగా విస్తరిస్తున్న రహదారి డీపీఆర్ పనులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.. అలాగే సిరోంచ – ఆత్మకూర్ ఎన్.హెచ్-353సీ పూర్వనిర్మాణ పనులు పూర్తయినందున వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
2024-25 వార్షిక ప్రణాళికలో పేర్కొన్న 13 రోడ్లకు సంబంధించి డీపీఆర్ ఫైనల్ కన్సల్టెంట్లను ఫైనల్ చేసి డిసెంబర్ 20వ తేదీకల్లా ఖరారు చేయాలని ఆదేశించారు. ఇందులో నిజామాబాద్-జగదల్ పూర్ ఎన్.హెచ్-63, కొత్తగూడెం బైపాస్ ఎన్.హెచ్-30, హుజూర్ నగర్ బైపాస్ – ఎన్.హెచ్.167, ఖమ్మం బైపాస్ ఎన్.హెచ్-163జీ, హైదరాబాద్ – భూపాలపట్నంలో ఎన్.హెచ్-163 మేజర్ బ్రిడ్జీలు, నకిరేకల్-దామరచర్ల ఎన్.హెచ్-365 కి సంబంధించిన డీపీఆర్ తయారీక సంబంధించిన పూర్వ అంశాలను మంత్రి సమీక్షించి.. డిసెంబర్ 20 తేదీకల్లా డీపీఆర్ కన్సల్టెంట్లను ఖరారు చేస్తేనే దాదాపు 2117 కోట్ల రూపాయల నిధులు మంజూరీ చేయించానని మంత్రి చెప్పారు.