హైదరాబాద్, రేతిబౌలిలోని కింగ్స్ కొహినూర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనేక మంది ప్రఖ్యాత కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాలను, కళాఖండాలను మంత్రి జూపల్లి తిలకించారు. వారి కృషిని, ప్రతిభను కొనియాడారు. తమ సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలతో ఆర్ట్ ఫెస్టివల్ ను సుసంపన్నం చేసిన కళాకారులను, ప్రతి ఏటా ముంబై, బెంగళూర్ లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్రను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, మంచి పెయింటింగ్స్ చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. కళలు, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన ప్రోత్సాహం వారికి మరింత ఉత్సహాన్ని ఇస్తుందని, కొత్త కళాఖండాలను మనకు అందించేలా వారికి ప్రేరణను ఇస్తుందని చెప్పారు. ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు ఒకేచోట చూడటం అద్భుతంగా ఉందనని, కళా ప్రేమికులకు ఇది మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.