భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి నది ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంపై గోదావరీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి ఉధృతి మరియు వరద పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి టెలిఫోన్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.