Tuesday, April 22, 2025
HomeNewsTelanganaహైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఒప్పందం

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఒప్పందం

అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్‌డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాలయం ద్వారా 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

బుధవారం ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెక్‌డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈఓ క్రిస్ కెంప్‌కిన్‌స్కీ, ఇతర సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడుల ఒప్పందం కుదిరింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా ఉన్నారు.

Also Read.. | Ritu Varma: స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ రీతూ వర్మ !

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పటికీ, మెక్‌డొనాల్డ్స్ తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ పొందిన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ యూనివర్సిటీని స్కిల్ జోన్‌గా ఉపయోగించుకుని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్‌లోనే కాకుండా, దేశ విదేశాల్లోని తమ కార్యాలయాలు, అవుట్‌లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

బెంగళూరు వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మెక్‌డొనాల్డ్స్ సీఈఓ క్రిస్ కెంప్‌కిన్‌స్కీ అన్నారు. అందుకే హైదరాబాద్‌ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్‌గా ఎంచుకున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మరో 3 లేదా 4 కొత్త అవుట్‌లెట్లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments