జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. అధిష్టానం ఇదివరకే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలను పెండింగ్ లో ఉంచింది. పెండింగ్ లో జనగామ కూడా ఉంది. గత కొన్ని రోజులుగా టికెట్ ఎవరికి వస్తుందోనని క్యాడర్ లో అయోమయం నెలకొని ఉంది. అయితే, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సీఎం కేసీర్ ఆర్టీసీ చైర్మెన్ పదవి కేటాయించారు. దీంతో, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అయింది. ప్రగతి భవన్ పెద్దలు కూడా నియోజకవర్గంలో పని చేసుకోమని సూచించడంతో పల్లాకే టికెట్ ఖాయమని తెలుస్తోంది. నేడోరేపో అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రతిరోజు నియోజకవర్గ నేతలతో, పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కలుస్తున్నారు. ఆయా గ్రామాలలో పార్టీ పరిస్థితులు, సమస్యలపై ఆరా తీస్తున్నారు. అప్పటికప్పుడే నిధుల మంజూరుకు అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరిస్తున్నారు. టికెట్ ప్రకటన రాగానే కొమురవెళ్లి నుండి జనగామకు భారీర్యాలీకి క్యాడర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్దం అవుతున్నాయి. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనకు కేటాయించిన కీలక ఆర్టీసీ చైర్మెన్ పదవిపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.