ఖమ్మం వేదికగా, జూన్ మూడవ వారంలో జరిగే టీయూడబ్ల్యూజే (TUWJ) మూడవ రాష్ట్ర మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ సూచించారు.
మహాసభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గాను ఆదివారం నాడు ఆయన ఖమ్మం పర్యటించారు. ఈ సందర్బంగా కావేరి హోటల్ లో ఏర్పాటైన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మహాసభ ఏర్పాట్లపై చర్చించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు రాష్ట్రంలోని 33జిల్లాల్లో ప్రాతినిద్యం వహిస్తున్న జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరువుతున్నట్లు ఆయన చెప్పారు. వీరితో పాటు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ నాయకులను, ఇతర రాష్ట్రాల నుండి సౌహార్థ ప్రతినిధులను ఆహ్వానించేందుకు యోచిస్తున్నట్లు విరాహత్ అలీ తెలిపారు. మహాసభల నిర్వహణకు గాను ఆహ్వాన సంఘంతో పాటు, ఆయా ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీలను నియమించుకోవాలని ఆయన సూచించారు. మహాసభల ప్రచారంలో భాగంగా జిల్లాలో సెమినార్లు ఏర్పాటు చేయాలన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాంనారాయణ మాట్లాడుతూ, 1989, 2000 సంవత్సరాల్లో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలకు ఖమ్మం జిల్లా అతిథ్యమిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. 24ఏళ్ళ తర్వాతా మళ్ళీ మహాసభ నిర్వహించే అవకాశం తమకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమిష్టి సహకారంతో మహాసభలను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖాదర్ బాబా, రమణ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంద్ర శేషు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణు, మురారి, సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రాష్ట్ర నాయకులు ఎన్.వెంకట్రావ్, ఖదీర్, భూపాల్, యూనియన్ ఖమ్మం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాపారావు, శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, సైదులు, సీనియర్ నాయకులు నలజాల వెంకట్రావ్, రత్నం, మొయినొద్దీన్, అన్సార్ పాషా, టి.మురళి, వీడియో జర్నలిస్టుల విభాగం అధ్యక్షులు అప్పారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.