బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని.. మహిళలంటే కేటీఆర్ కు ఏ మాత్రం గౌరవం లేదని ఆమె ఫైర్ అయ్యారు.
వరలక్ష్మీ శుక్రవారం రోజున సంతోషంగా పండుగ జరుపుకుంటున్న మహిళలకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు క్షోభ కలిగిస్తున్నాయని అన్నారు. మహిళలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సమంజసమా? కాదా? అని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే కూడా తెలుస్తుందని అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారంతా పేద, మధ్యతరగతి మహిళలలేనని, డబ్బుందనే అహంకారంతో కేటీఆర్ పేద, మధ్య తరగతి మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. మహిళల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడో రకంగా మాట్లాడటం కేటీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణమే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేటీఆర్ ను బయట తిరగనీయమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.