ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన “ప్రగతి ప్రస్థానం…ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది “— పుస్తకాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ నేడు ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయని కెటిఆర్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచి, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయని అన్నారు. ఫలితంగానే తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు సాక్షాత్తు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అద్భుత పనితీరును ఇలాంటి నివేదికలెన్నో తేల్చిచెప్పాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బిఆర్ఎస్ ప్రభుత్వం 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుంధుబి మోగించిందనీ, 2023 లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితమవుతామని కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా తన సంపాదకత్వంలో “ప్రగతి ప్రస్థానం” పుస్తకంగా వెలువరించిన సీనియర్ జర్నలిస్టు, సీఎం పిఆర్ఓ రమేష్ హజారీ కృషిని మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ నాడు ఎట్లుండే నేడు ఎంతగా అభివృద్ధి చెందింది అనే విషయాలను తెలుసుకోగోరే ప్రతీ ఒక్కరికీ ఈ పుస్తకం ఒక హ్యాండ్ నోట్ గా ఉపయోగ పడుతుందని కేటీఆర్ అన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణను సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా, తన సాహిత్య ప్రతిభతో సోషల్ మీడియాలోనూ, పాటలు, సాహిత్యం, పుస్తకాల రూపంలోనూ సృజనాత్మక. విధానాల్లో ప్రభుత్వ కార్యాచరణను జనంలోకి తీసుకుపోయేలా సీనియర్ జర్నలిస్ట్ రమేష్ హజారీ పాటుపడుతున్న తీరును కేటీఆర్ ప్రశంసించారు.