తండ్రి పై కళ్లెదుటే పాశవికంగా దాడి జరుగుతుంటే చూడలేక సాయం కోసం రోదించి, రోదించి 14 ఏళ్ల పావని అనే అమ్మాయి చనిపోయిన సంఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఢీకొత్తపల్లి అనే గ్రామంలో జరిగిన ఈ ఘటన తన మనసును కలిచివేసిందని అన్నారు. భూతగదాల కారణంగా సోమయ్య అనే వ్యక్తిపై తన భార్య, కూతురు ముందే ఇనుపరాడ్లతో ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. దీంతో తండ్రిని కాపాడుకునేందుకు సాయం కోసం పావని విలపించి, విలవించి సృహా తప్పి పడిపోయి చనిపోయింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మనసంతా భారంగా ఉందన్నారు కేటీఆర్. కూతురంటే అత్యంత ప్రేమగా చూసుకునే తండ్రిగా ఆ అమ్మాయిని రక్షించుకోలేకపోవటం బాధగా ఉందన్నారు. పావని కుటుంబానికి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా వరుసగా పాశవికంగా జరుగుతున్న దాడులు చూస్తుంటే తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పినట్లు కనిపిస్తుందన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం అలర్ట్ గా ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదన్నారు. పావని నిన్ను కాపాడుకోలేకపోయినందుకు క్షమించాలని కేటీఆర్ కోరారు.