మహిళలంటే తనకు ఎనలేని గౌరవం ఉందని బఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను శనివారం ఉదయం కలిసి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ భవన్ నుండి పార్టీ మహిళా నేతలతో కలిసి ఉదయం 11 గంటల వరకు మహిళా కమిషన్ కు చేరుకున్నారు. కేటీఆర్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను కలిసి తన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యధాలాపంగా తాను చేసిన వ్యాఖ్యలకు ఇది వరకే క్షమాపణలు కోరానని ఆయన తెలిపారు. మహిళలపై తనకు గౌరవముందని చెప్పారు. చట్టమన్నా, రాజ్యాంగబద్ద సంస్థలన్నా తనకు గౌరవముందని.. అందుకే తానే స్వయంగా హాజరై సమాధానం ఇచ్చానని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, ఒక్కోసారి మాట దొర్లితే క్షమాపణ చెప్పే సంస్కారం ఉండాలని అన్నారు. కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ మహిళా నేతలు, బీఆర్ఎస్ మహిళ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పోటాపోటీ నినాదాలు చేశారు.