ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనానికి మొదటిరోజు నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి 70 అడుగుల భారీ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. వరుసగా నాలుగు రోజులు సెలవువు ఉండడంతో వినాయకుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. శనివారం ఒక్కరోజే నాలుగున్నర లక్షలమంది ఖైరతాబాద్ బడా గణేషున్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం మంగళవారం ఉన్నా.. దర్శనం ఆదివారం అర్దరాత్రితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. సోమవారం రోజు భారీ వాహనానికి వెల్డింగ్ పనులు, శోభాయాత్రకు ఏర్పాట్లు, ఇతర పనులు ఉంటాయి కాబట్టి దర్శానానికి నేడే చివరిరోజు అని నిర్వాహకులు తెలిపారు.
దర్శనానికి ఆదివారం చివరిరోజు కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని పోలీసలు తెలిపారు. హైదరాబాద్ నుండే కాకుండా.. ఇతర జిల్లాల నుండి కూడా బడా గణనాథున్ని చూడడానికి భక్తులు తరలి వస్తున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని.. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా భద్రతను మానీటరింగ్ చేస్తున్నామని పోలీసులు చెపుతున్నారు. ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా జనసందోహంతో క్రిక్కిరిసి పోతున్నాయి. అటు ఖైరతాబాద్ కు వచ్చే బస్సులు, మెట్రో స్టేషన్లు, ఎంఎంటీఎస్ రైళ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి.
ఖైరతాబాద్ భారీ గణనాథుని శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పోలీసులు సిద్దం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటలకే గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని అన్ని గణనాథుల శోభాయాత్రలకు పోలీసులు నిర్వాహకులకు ఇప్పటికే పలు కీలక సూచనలు చేశారు. రూట్ మ్యాప్ కు సంబందించి పోలీసలు బందోబస్తుకు సిద్దం అయ్యారు. హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ మూడు కమీషనరేట్ ల పరిదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భారీబందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశామని ఇప్పటికే సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బడా గణేషున్ని మద్యాహ్నం 1:30 లోపు గంగమ్మ ఒడికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.