హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) కు నెలవు అన్నారు. వీటిని కాపాడు కోవాలంటూ పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వలన ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురి కాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని ఆయన తెలిపారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని, వాటినే కూల్చి వేస్తున్నారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాటిలైట్ ఫోటోల ద్వారా రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంతమేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసు కుంటున్నామని అన్నారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది ప్రజల ముందు పెడతామని తెలిపారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు. అన్నీ లెక్కలతోసహా ప్రజలముందు పెడతామని.. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.