జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు తొలగించడంపై బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలు జూటూరు కీర్తిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బూత్ లెవల్ అధికారుల తప్పిదం వల్ల పార్లమెంటు ఎన్నికలో సుమారు 16,000 మంది ఓటు హక్కును కోల్పోయారని, అందులో తాజాగా ఓటు హక్కు పొందినవారు కూడా ఉన్నారని తెలిపారు. స్థానికంగా ఉండే బీజేపీ వ్యతిరేఖ శక్తులు ఈ ఓట్ల తొలగింపులో కీలక పాత్ర పోషించారని, వారికి స్థానిక బూత్ లెవల్ అధికారులు కూడా సహకరించినట్లు తెలిపారు. ఈ సమస్యను ఈ మెయిల్‌తో పాటు వాట్సాప్ ద్వారా ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసినా పరిష్కరించబడలేదన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బూత్ లెవల్ ఆఫీసర్ల ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. ఈ అంశంలో పూర్తి వివరాలను, బాధితుల లేఖలను కూడా ఫిర్యాదులో జోడించామన్నారు. ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపి ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తారని విశ్వశిస్తున్నామన్నారు.
వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ ఓట్ల తొలగింపులు, పోలింగ్ స్టేషన్ మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని, అధికారులు వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.