తెలంగాణలో కేసిఆర్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎద్దేవా చేశారు. కోదాడ పట్టణంలో కార్నర్ మీటింగ్ లో ఆయన వేలాదిమంది కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తం 25 వేల మెజార్టీతో గెలుస్తుందన్నారు. ప్రజలు కెసిఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. ఇల్లు లేని వారికి కాంగ్రెస్ పార్టీ వంద గజాల స్థలం తో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఐదు లక్షలు ఇస్తుందన్నారు. కర్ణాటకలో చేసింది తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపిస్తామన్నారు. కర్ణాటకలో మేము ఏం చేశామో చూపిస్తాం రమ్మని సీఎం తో సహా మంత్రులు వచ్చి చూడొచ్చన్నారు.
గత ఎన్నికల్లో కోదాడలో 6 వందల ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన పద్మావతి 25 వేల మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఒక మునిగిపోయే నావా అని బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కేసిఆర్, కేటీఆర్ కర్ణాటక వచ్చి తాము అమలు చేస్తున్న హామీలను చూడవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, డీకే శివకుమార్ కార్నర్ మీటింగ్ కు వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. కోదాడ పట్టణమంతా జనమయమైంది. కాంగ్రెస్ జెండాలతో, నినాదాలతో మారుమోగింది. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఉత్తం పద్మావతి, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, స్థానిక కాంగ్రెస్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.