ఆషాడ బోనాల నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేయబోయే ఉత్సవ కమిటీలో తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జోగిని కొలిపాక శ్యామల దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. ఈ మేరకు జోగిని శ్యామల ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మంత్రి కొండా సురేఖను శుక్రవారం సెక్రటేరియట్ లోని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఆషాడ బోనాల్లో ప్రజలు, శివసత్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైభవోపేతంగా బోనాల పండుగను నిర్వహించాలని, శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని, సుదీర్ఘ కాలంగా బోనాల పండుగ వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపునివ్వాలని వారు మంత్రి సురేఖను కోరారు. వారి విన్నపాలను ఓపికతో విన్న మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. శివసత్తులను ప్రజలు దైవాంశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగలో శివసత్తులకు ప్రత్యేక స్థానమున్నదని తెలిపారు. లక్షలాదిగా భక్తులు హాజరయ్యే బోనాల ఉత్సావాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వైభవోపేతంగా నిర్వహించేందుకు, సంఘం వినతులకు కార్యరూపం ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి సురేఖ వెల్లడించారు.