గత ఏడు ఏండ్లుగా చేర్యాల ప్రాంత ప్రజలు రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమం చేస్తుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం డివిజన్ ప్రకటన చేయకుండా ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా అవమానించిందని జాక్ చైర్మన్ (JAC Chairman) చక్రదారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షను గుర్తించడంలో బీఆర్ ఎస్ నాయకులు, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని అన్నారు. ప్రజల న్యాయమైన కోర్కెలను తీర్చటంలో మంత్రి హరీశ్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేర్యాల, మద్దూరు ఉమ్మడి మండలాల ప్రజలను తీవ్రంగా వంచించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత కొంత కాలంగా ఎన్నో డివిజన్లను ప్రకటించిన ప్రభుత్వం అసలు చేర్యాలను ఎందుకు ప్రకటించ లేదో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తిగా ఇక్కడి ప్రజలను వంచించారని, నియంతృత్వ భావజాలం ఉన్న వ్యక్తులే ప్రజల ఉద్యమాలను గుర్తించరని చక్రదారి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పార్టీలకు అంతిమం అని అన్నారు. జనగామ నియోజకవర్గంలో ఇప్పుడు పల్లా రాజేశ్వర్ పోటీ చేస్తారని అంటున్నారని.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించి కేసీఆర్ కు కానుకగా ఇస్తే తప్ప ఇక్కడి ప్రజల ఆవేదన ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్థం కాదన్నారు. 2014, 2018 ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే డివిజన్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వక ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఇక పల్లాను ఓడించటమే చేర్యాల ప్రాంత ప్రజల లక్ష్యం కావాలని.. తదనుగుణంగా జాక్ బృందం గ్రామాల్లో తిరిగి ఓటర్లను చైతన్య పరుస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రజలకు, కులసంఘాలకు, మీడియా మిత్రులకు, చేర్యాల మద్దూరు కొమురవెల్లి పోలీసు అధికారులకు, అలాగే నాయకులు అందెబీరన్న, నరేష్, రాకేష్, నాస్తిక రమేష్, ఒగ్గురాజు, ఇషాక్, పుల్లని వేణు, కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు పేరు పేరున జాక్ చైర్మన్ చక్రదారి ధన్యవాదాలు తెలిపారు.