కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కూడా ఆలయ నిర్వాహకులు మల్లన్న కల్యాణోత్సవానికి ఆహ్వానించారు.

అంతకుముందు ఆలయ అధికారులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో కలిసి, కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి ఆహ్వానించారు. మంత్రికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాలను, చిత్రపటాన్ని అందించారు.

డిసెంబర్ 29 న ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణం, 19 జనవరి 2025 నుండి 10 (ఆది)వారాలపాటు, 23 మార్చి 2025 వరకు జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు కొమురవెల్లి ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కల్యాణం, జాతరల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల పై మంత్రి సురేఖ దేవాలయ కార్యనిర్వాహణాధికారి బాలాజిని ఆరా తీశారు. కల్యాణ వేదికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్వామి వారి కల్యాణం, జాతరలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమురవెల్లి మల్లన్న ఆలయ ఈవో బాలాజి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.