బీజేపీ అధిష్టానంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. పార్టీపై అలకతో నిన్న వరద ప్రభావిత ప్రాంత పర్యటనకు ఏలేటి వెళ్లలేదు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు రెండు బృందాలను రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల ఆధ్వర్యంలో బృందాలు పరిశీలనకు వెళ్లాయి. ఈటల బృందంలో ఏలేటిని సభ్యుడిగా రాష్ట్ర నాయకత్వం చేర్చింది. ఫ్లోర్ లీడర్‌ను సభ్యుడిగా ఎలా పంపిస్తారంటూ ఏలేటి వర్గం అధిష్టానాన్నిప్రశ్నిస్తోంది. అందుకే ఆయన వారితో కలిసి పర్యటనకు వెళ్లలేదు. తన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారని.. ఈ అంశాన్ని పార్టీ అధినాయత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అధిష్టానం నుండి ఆయనకు ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఏలేటి అలక ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈటల బృందంలో వెల్లడం ఇష్టం లేకపోతే.. ప్రత్యేకంగా తను వరదల పర్యటనకు వెల్లాల్సింది అని.. ప్రజల మద్యకు వెళ్లే అవాకాశాన్ని ఏలేటి మిస్ చేసుకున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మిగతా సమయాల్లో అలకలు ఎలా ఉన్నా.. వరదల సమయంలో భేషజాలకు పోకుండా మహేశ్వర్ రెడ్డి పర్యటనకు వెళ్లి.. ఆ తరువాత పార్టీలో ఈ అంశంపై మాట్లాడితే బాగుండేదని పార్టీలో మరికొందరు అనుకుంటున్నారట. గత కొంత కాలంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లు పెట్టాలంటే.. మీడియా ఇంచార్జీకి సబ్జెక్ట్ చెప్పిన తర్వాతే మీడియా సమావేశం పెట్టాలనే మౌఖిక ఆదేశాలు వచ్చాయనే టాక్ నడిచింది. ఆ అంశం పట్ల కూడా మహేశ్వర్ రెడ్డి గుర్రుగా ఉన్నారట. అందుకే ఆయన బీజేఎల్పీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ లు పెడుతున్నారట. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, ఎల్పీనేతకు గ్యాప్ ఉందని కొన్నిరోజులుగా వస్తున్న వార్తలకు తాజా ఘటన బలం చేకూరుస్తుంది.