లోక్ సభ ఎన్నికల ముందు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మద్య మాటల మంటలు ఇంకా చల్లారడం లేదు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది. అదే విషయాన్ని కొత్తగూడెం జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని ఎవరైనా మారుస్తామని అంటే.. వారిని చెప్పులతో కొట్టండని బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటున్నారని తెలిపారు. అయితే, నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ ఒక చానల్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తాము మళ్లీ అధికారంలోకి రాగానే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ను మారుస్తామని అన్నారని రేవంత్ తెలిపారు. ఇప్పుడు ఎవరిని చెప్పులతో కొట్టాలో చెప్పండని ప్రశ్నించారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకోసమే అని.. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలంగా కాంగ్రెస్ కు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు.